ఉద్యోగాలు ఇప్పిస్తామని.. విదేశాల్లోని వ్యభిచార గృహాలకు మహిళల తరలింపు

ఉద్యోగాలు ఇప్పిస్తామని.. విదేశాల్లోని వ్యభిచార గృహాలకు మహిళల తరలింపు

Rachakonda police arrested a gang : ఆర్థిక ఇబ్బందులున్న యువతులే వారి టార్గెట్‌.. విదేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించుకోవాలనుకున్నవారే వారి పెట్టుబడి.. అటువంటి ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. వర్కింగ్‌ వీసాల పేరుతో విజిటింగ్ వీసాలు ఇచ్చి విదేశాలకు పంపించే.. ఆ ముఠా పోలీసులకు ఎలా చిక్కింది? యువతులను విదేశాలకు పంపి వాళ్లు చేస్తున్న పాడుపనులేంటి? తెలుగు రాష్ట్రాల్లో మహిళలను గల్ఫ్‌ దేశాలకు తరలిస్తున్న ముఠాను రాజకొండ పోలీసులు పట్టుకున్నారు.

మంచి ఉద్యోగాలున్నాయని ఇప్పటికే చాలా మంది మహిళలను ఆ ముఠా సౌదీ రాష్ట్రాలకు పంపినట్టు దర్యాప్తులో తేలింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో అల్‌ హయత్ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ఆ ముఠాకు పాస్‌పోర్ట్‌, వీసాలు అరెంజ్‌ చేస్తుంది. విజిటింగ్ వీసాలతో అక్కడికి వెళ్లిన మహిళలు.. వ్యభిచార కూపాల్లో చిత్రహింసలకు గురౌతున్నారు. గతంలో ఎన్నో ముఠాలను పట్టుకున్నా.. కొత్తకొత్త ముఠాలు పుట్టుకు వస్తున్నాయంటున్నారు పోలీసులు.

ట్రావెల్స్‌ కంపెనీకి తెలుగురాష్ట్రాల్లో చాలా మంది ఏజెంట్లు ఉన్నారు. అల్‌హయత్ ట్రావెల్స్‌ను మహ్మద్‌ నాసీర్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. మహిళలను రవాణా చేస్తున్న వారు గతంలో మస్కట్‌కు వెళ్లి వచ్చి.. ఇక్కడ ఏజెంట్లుగా మారారు. ట్రావెల్స్‌ యజమాని నాసిర్ ప్రస్తుతం మస్కట్‌లోనే ఉన్నాడు. గతంలో మస్కట్‌ వెళ్లి వచ్చిన ఖాదర్‌ బీ అనే మహిళ.. మళ్లీ అక్కడికి వెళ్లాలని అనుకుంది.

తన పిన్నిని అక్కడికి పంపిన ట్రావెల్స్‌ను సంప్రదించింది. ఫిబ్రవరి రెండవ తేదీ ఆమె అక్కడికి వెళ్లాల్సి ఉండగా అది కుదరలేదు. దీంతో ఏజెంట్లు ఫిబ్రవరి 7న వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే.. ట్రావెల్స్‌ మీద అనుమానం వచ్చిన ఖాదర్‌ బీ వారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

మహిళ కంప్లైంట్‌తో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ముఠా గట్టును రట్టు చేశారు. విదేశాలకు యువతులను పంపించడం ద్వారా ఏజెంట్లు లక్షల రూపాయలు సంపాదించినట్టు గుర్తించారు పోలీసులు. అక్కడికి వెళ్లిన వాళ్లు.. వీసాలు సరైనవి కాకపోవడంతో.. వ్యభిచార కూపాల్లో.. అక్కడ నుంచి తప్పించుకుంటే జైళ్లలో ఉండాల్సి వస్తుంది.

30 ఏళ్లకు పైబడిన వారు మాత్రమే విదేశాల్లో పనులకు వెళ్లేందుకు అర్హులు. అయితే, దొంగ సర్టిఫికేట్లతో ముఠా మహిళలను రవాణా చేస్తోంది. ప్రొటెక్ట్‌ ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌తో సంప్రదించి ట్రావెల్స్‌ గుర్తింపు రద్దు చేయిస్తామని, దాని యజమానిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు.