ఏపీ, తెలంగాణకు అలర్ట్.. మరో రెండు రోజులు వర్షాలు

ఏపీ, తెలంగాణకు అలర్ట్.. మరో రెండు రోజులు వర్షాలు

rain alert for ap, telangana: ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలు, ఏపీలోని ఉత్తర కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడొచ్చని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం(ఫిబ్రవరి 19,2021) ఉదయం నుంచి ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.

తెలంగాణలోనూ వానలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో గురువారం(ఫిబ్రవరి 18,2021) అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చలిగాలుల తీవ్రత పెరిగింది. కాగా, పంటలు చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.