హైదరాబాద్ మళ్లీ కుండపోత..జనాల ఇక్కట్లు

  • Published By: madhu ,Published On : October 20, 2020 / 08:07 AM IST
హైదరాబాద్ మళ్లీ కుండపోత..జనాల ఇక్కట్లు

rainfall Again In various places hyderabad : వాన..వాన ఇక వద్దమ్మా అంటున్నారు నగర జనాలు. ఎందుకంటే నరకం చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. నగరం ప్రజల గుండెలు చెరువయ్యాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాల కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.



కాస్త తెరిపించాడని అనుకున్న తరుణంలో…మళ్లీ 2020, అక్టోబర్ 20వ తేదీ మంగళవారం ఉదయం నుంచి నగరంలో వర్షం కురుస్తోంది. ఇప్పటికే జలదిగ్భందంలో చిక్కుకున్న ప్రజలు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి, నిత్యావసర సరకులు లేకపోవడంతో వారు పడుతున్న బాధ వర్ణానాతీతంగా ఉంది.



బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చార్మినార్, ఖైరతాబాద్, కోటి, నాంపల్లిలో ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్టలో ఓ మోస్తరు వర్షం కురుస్తుండగా, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, బడంగ్‌పేట్, మీర్‌పేట్‌లో కుండపోతగా వర్షం పడడంతో పలు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. జలదిగ్భందంలో చిక్కుకున్న ఇళ్లు బురదమయంగానే ఉన్నాయి. మరోవైపు జీహెచ్ఎంసీ, ఇతర శాఖలు అలర్ట్ అయ్యారు. సహాయక చర్యలు చేపడుతున్నారు



తూర్పు పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుండడంతో వర్షాలు కురుస్తున్నాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇది మంగళవారం మధ్యాహ్నం తర్వాత.. అల్పపీడనంగా మారే అవకాశం అవకాశం ఉందని తెలిపింది.



వచ్చే రెండ్రోజుల పాటు వర్షాలు:
మరో రెండు రోజుల పాటు భాగ్యనగరంలో ఇదే వాతావరణం కొనసాగనుంది. ఇప్పటికే.. వెదర్ డిపార్ట్‌మెంట్ నుంచి దీనికి సంబంధించిన వార్నింగ్ కూడా వచ్చేసింది. వచ్చే రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే చాన్స్ ఉందని తెలిపింది. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు వాతావరణశాఖ అధికారులు.