జాగ్రత్త సుమా, మరో మూడు రోజులు భారీ వర్షాలు

  • Published By: madhu ,Published On : September 17, 2020 / 09:53 AM IST
జాగ్రత్త సుమా, మరో మూడు రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 20వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ, దక్షిణ ఛత్తీస్ ఘడ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనంగా ఏర్పడింది.




వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టులన్నీ నీటితో నిండిపోయాయి. సెప్టెంబర్ 16వ తేదీ బుధవారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

నాగర్‌కర్నూల్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం, మంచిర్యాల, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, కరీంనగర్‌, సిద్దిపేట, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, మహబూబాబాద్‌, జనగాం, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.




కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమయంలో చేపల వేటకు వెళ్లవద్దని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.