కనువిందు చేస్తున్న ఆరుద్ర పురుగులు..ముందే వచ్చేశాయని మురిసిపోతున్న రైతన్నలు

  • Published By: nagamani ,Published On : June 11, 2020 / 06:48 AM IST
కనువిందు చేస్తున్న ఆరుద్ర పురుగులు..ముందే వచ్చేశాయని మురిసిపోతున్న రైతన్నలు

బీడువారిన నేతలపై తొలకరి జల్లులు పడగానే బిలబిలామంటూ ఆరుద్ర పురుగులు నేలపైకి వచ్చేస్తాయి. అలా ఆరుద్రపురుగులు నేలపై కనిపిస్తే ఆ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురుస్తాయనీ..రైతన్నలు చక్కగా వ్యవసాయం చేసుకోవచ్చని అంటారు. అలా..ఆరుద్ర పురుగులకు , రైతులకు అవినాభావ సంబంధం ఉంది. ఎర్రగా, బొద్దుగా చూడ ముచ్చటగా ఉండే ఆరుద్ర పురుగు ఆగమనాన్ని రైతులు శుభసూచకంగా భావిస్తారు. ఇక వ్యవసాయం పనులు మొదటు పెట్టుకోవచ్చని ఆనందంగా పొలాలకేసి మళ్లుతారు. 

ఎర్రగా..బొద్దుగా..చక్కటి రంగులో మెరిసిపోయే ఈ అందమైన పురుగులు తొలకరి వర్షాలు కురవగానే కుప్పలు కుప్పలుగా కనిపించి కనువిందు చేస్తాయి. వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు ఆరుద్ర కార్తె అనుకూలమైంది. ఈ కార్తెలో మాత్రమే కనబడే అరుదైన పురుగు ఆరుద్ర. అందుకే దాన్ని ఆరుద్ర పురుగు అంటారు. ఇవి ప్రకృతి నేస్తాలు. సాధారణంగా ఈ ఆరుద్ర పురుగులు ఆరుద్ర కార్తెలో కనిపిస్తాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఆరుద్ర కార్తెకు ముందుగానే అంటే మృగశిర కార్తెలోనే కనిపించి కనువిందు చేస్తున్నాయి. అంటే ఈ సంవత్సరం వర్షాకలకు కొదువ లేదన్నమాట అనుకుని రైతులు పులకించి పోతున్నారు.

పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కెపూర్ పంట పొలాల్లోను..ఖానాపూర్‌ అడవుల్లోను ఆరుద్ర పురుగులు దర్శనం ఇవ్వడంతో రైతులు శుభసూచకంగా భావించి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పురుగులను రైతులు చూస్తే చాలు ఆనందంతో పరవశించిపోతారు.

ఎందుకంటే ఆరుద్ర పురుగులు కనిపించాయంటే ఆ సంవత్సరం వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని రైతుల నమ్మకం. మనిషి స్వార్థం కోసం విచ్చలవిలవిడి ఎరువులు, రసాయనాలు వాడుతూ పుడమి తల్లిని కాలుష్య కాసారంగా మారుస్తున్నాడు. దీంతో వీటి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. కానీ ఈ సంవత్సరం మాత్రం ఆరుగ్ర కార్తెకు ముందే మృగశిర కార్తెలోనే ఆరుద్రలు కనిపించటంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. 

ఆరుద్ర పురుగు – దీనినే కొన్ని చోట్ల పట్టు పురుగు అనీ, చందమామ పురుగు అనీ, లేడీ బర్డ్ అనీ, ఇంద్రగోప పురుగు అని కూడా అంటారు. ఇలా చాలా పేర్లు  ఉన్న ఈ పురుగు చూడటానికి ఎర్రని మఖ్మల్ బట్టతో చేసిన బొమ్మలాంటి పురుగులా ఉంటుంది. ముట్టుకుంటేనే – అత్తిపత్తి చెట్టు ఆకుల్లా ముడుచుకు పోయే స్వభావం ఉన్న ఈ పురుగులు నేలమీద కాసింత ఇసుక నేలల్లో, పచ్చగడ్డి కాసింత ఉన్న చోట్లలో విరివిగా కనిపిస్తాయి. ఈ అందమైన, మెత్తనైన పురుగులు వర్షాకాలం తొలకరి వర్షాలు కురవగానే, బిల బిల మంటూ కుప్పలు కుప్పలుగా కనిపించి కనువిందు చేస్తాయి. 

Read:రోడ్లమీద వాడిపారేస్తున్న మాస్క్‌లు, గ్లౌజ్‌‌లతో హైదరాబాద్‌కు ప్రమాదం. అర్ధమవుతోందా?