Case On R Krishnaiah : ఆర్.కృష్ణయ్య అరాచకాలపై ముమ్మర దర్యాప్తు చేయాలి- రవీందర్ రెడ్డి

వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థి ఆర్.కృష్ణ‌య్య‌పై నాన్ బెయిలబుల్ కేసు న‌మోదైంది. తన ల్యాండ్ కబ్జా చేయడమే కాకుండా రౌడీలు, గూండాలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని..(R Krishnaiah)

Case On R Krishnaiah : ఆర్.కృష్ణయ్య అరాచకాలపై ముమ్మర దర్యాప్తు చేయాలి- రవీందర్ రెడ్డి

R Krishnaiah

Case On R Krishnaiah : బీసీ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, తాజాగా వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేసిన ఆర్.కృష్ణ‌య్య‌పై నాన్ బెయిలబుల్ కేసు న‌మోదైన సంగతి తెలిసిందే. హైద‌రాబాద్‌కు చెందిన ర‌వీంద‌ర్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను విచారించిన కోర్టు జారీ చేసిన ఆదేశాల‌తో హైద‌రాబాద్‌లోని రాయ‌దుర్గం పోలీస్ స్టేష‌న్‌లో ఆర్‌.కృష్ణ‌య్య‌తో పాటు మ‌రికొంద‌రిపై కేసులు న‌మోద‌య్యాయి.

తన ల్యాండ్ కబ్జా చేయడమే కాకుండా రౌడీలు, గూండాలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని రవీందర్ రెడ్డి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన భూమిని కబ్జా చేయడమే కాకుండా తనను చంపడానికి ఆర్ కృష్ణయ్య ప్రయత్నించారని.. ఫిర్యాదు చేశారు రవీందర్ రెడ్డి. దీంతో ఆర్ కృష్ణయ్య పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు.(R Krishnaiah)

ఆర్ కృష్ణయ్యపై కేసు వేసిన ఈబీసీ నేషనల్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి టెన్ టీవీతో మాట్లాడారు. ‘నాకు ఆర్.కృష్ణయ్యకు 40ఏళ్ల పరిచయం ఉంది. గత 20 సంవత్సరాల నుండి మా మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. నాకు కృష్ణయ్య ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా ఇచ్చేశా. నాకు రావాల్సిన డబ్బు 1.5 కోట్లు. నాకు రావాల్సిన డబ్బు మాత్రం ఇవ్వకపోవడమే కాకుండా నాపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. నల్గొండలో నా ఫార్మ్ హౌస్ ని కబ్జా చేసే యత్నం చేశాడు. కృష్ణయ్య ప్రవర్తన కారణంగా 2018 నుండి అతడిని దూరం పెట్టా.

R. krishnaiah: సామాజిక న్యాయంలో జగనే నెంబర్ వన్: ఆర్ కృష్ణయ్య

గత నాలుగు నెలల నుండి అతని అరాచకాలు తారస్థాయికి చేరాయి. మే 18న పోలీస్ స్టేషన్ ని ఆశ్రయిస్తే, నాకు 91 సీఆర్ పీసీ నోటీస్ ఇచ్చారు. తిరిగి మే 30న కోర్టుని ఆశ్రయిస్తే పోలీస్ స్టేషన్ కి కేస్ రిఫర్ చేశారు. తరువాత నిన్న డీసీపీ ఆఫీస్ కి వెళ్లాక కేసు నమోదు చేశారు. ఆర్.కృష్ణయ్యతో పాటు అతని అనుచరులు తొమ్మిది మంది నాపై దౌర్జన్యానికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేశారు. ఆర్.కృష్ణయ్య అరాచకాలపై ముమ్మర దర్యాప్తు చేయాలని’ రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ కేసు వివ‌రాల్లోకి వెళితే… హైద‌రాబాద్ ప‌రిధిలోని త‌న భూమిని ఆర్.కృష్ణ‌య్య క‌బ్జా చేశార‌ని రవీందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అంతేకాదు త‌న‌ను చంపేందుకు కూడా కృష్ణ‌య్య య‌త్నించార‌ని ఆయ‌న ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలో కొంద‌రు రౌడీలను, గూండాలను పంపి త‌న‌ను బెదిరిస్తున్నార‌ని ఆయ‌న కృష్ణ‌య్య‌పై తన పిటిషన్ లో కీల‌క ఆరోప‌ణ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు.. కృష్ణ‌య్య‌పై కేసు న‌మోదు చేయాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది.

కోర్టు ఆదేశాలతో ఆర్.కృష్ణ‌య్య స‌హా మ‌రికొంద‌రిపై రాయ‌దుర్గం పోలీసులు నాన్ బెయిల‌బుల్ సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. ఈ మేర‌కు ఐపీసీ సెక్ష‌న్లు 447, 427, 506, 384, రెడ్ విత్ 341 కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.

AP Politics : ఆర్. కృష్ణయ్య బీసీల కోసం పోరాటం చేశారా? వైసీపీలో పదవి కోసం పోరాటం చేశారా? : బుద్దా వెంకన్న

ఏపీ కోటా నుంచి వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ఇటీవ‌లే ఆర్.కృష్ణ‌య్య నామినేష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు శుక్ర‌వారంతో గ‌డువు ముగియ‌నుంది. మొత్తం 4 స్థానాల‌కు 4 నామినేష‌న్లే వ‌చ్చిన నేప‌థ్యంలో శుక్ర‌వారం ఆర్.కృష్ణ‌య్య స‌హా వైసీపీ అభ్య‌ర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆర్.కృష్ణ‌య్య‌పై నాన్ బెయిల‌బుల్ సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు కావ‌డం హాట్ టాపిక్ గా మారింది.