టీఆర్‌ఎస్‌కు రెబల్స్‌ బెడద..స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్‌

  • Published By: bheemraj ,Published On : November 22, 2020 / 07:47 AM IST
టీఆర్‌ఎస్‌కు రెబల్స్‌ బెడద..స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్‌

TRS Rebels : అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ఇప్పుడు కొత్త చిక్కొచ్చిపడింది.. GHMC ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థులకే అధికారపార్టీ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.. కానీ పోటీ తీవ్రంగా ఉన్న స్థానాల్లో కొంతమంది స్వతంత్రంగా బరిలో దిగేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగుస్తుండటంతో.. ఇప్పుడు వారిని బుజ్జగించేపనిలో పడింది గులాబీ పార్టీ.



గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా పావులు కదుపుతోంది టీఆర్‌ఎస్ పార్టీ.. గతంలో 99 స్థానాలు గెలుచుకున్న గులాబీ దళం ఈసారి సెంచరీ కొట్టాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తూ… వాటిని అమలు చేస్తోంది.. అధికార పార్టీ కావడంతో ఎన్నికల బరిలో నిలిచేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు భారీగానే పోటీ పడ్డారు.. కానీ గులాబీ పార్టీ మాత్రం సిట్టింగ్ కార్పొరేటర్ లకు అత్యంత ప్రాధాన్యత నిచ్చింది. 150 స్థానాల్లో 124 సీట్లను సిట్టింగ్ అభ్యర్థులకే మరోసారి కట్టబెట్టింది. అయితే చివరి నిమిషం వరకు అభ్యర్థుల జాబితా ఖరారు కాకపోవడంతో ఆశావాహులంతా నామినేషన్లను దాఖలు చేశారు..దీంతో ఇప్పుడు వారిని బుజ్జగించే పనిలో బిజీగా ఉంది గులాబీ పార్టీ అధినాయకత్వం.



ఇప్పుడు రెబల్‌ అభ్యర్థులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.. ఈ పరిస్థితిని అధిగమించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. పోటీ తీవ్రంగా ఉన్న డివిజన్‌లలో నామినేషన్లు వేసినా… టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న నేతలను బుజ్జగించే పనిలో కేటీఆర్ పడ్డారు. శనివారం నందినగర్‌లోని కేసీఆర్ స్వగృహంలో కొంత మంది రెబల్ అభ్యర్థులతో భేటీ అయ్యారు. పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. కేటీఆర్ స్వయంగా మాట్లాడటంతో రెబల్ అభ్యర్థులు దారిలోకి వస్తున్నారు. ఇన్‌ఛార్జిలుగా ఉన్న మంత్రులు కూడా పలు డివిజన్లలో రెబల్ అభ్యర్థుల తో చర్చలు జరిపి వారిని పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.



నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉండడంతో రెబల్ అభ్యర్థులను బరి నుంచి తప్పించేందుకు తీసుకోవలసిన చర్యలపై గులాబీ నేతలు దృష్టి పెట్టారు. కొంత మంది టికేట్ దక్కని నేతలు మాత్రం ఎన్నికల బరి నుంచి తప్పుకునే ఏది లేదని స్పష్టం చేస్తున్నారు. గులాబీ పార్టీ జెండాలు, కండువాలతో నే ప్రచారం చేస్తామని తేల్చి చెబుతున్నారు. వీరిపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.. నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసిన తర్వాత రెబెల్స్‌పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.