తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు వేళాయే..

  • Published By: madhu ,Published On : December 14, 2020 / 06:48 AM IST
తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు వేళాయే..

non-agri lands in Telangana : తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు 2020, డిసెంబర్ 14వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు నెలల అనంతరం మళ్లీ మొదలుకాబోతున్నాయి. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే రికార్డుల్లో పేరు మార్పు పూర్తి చేయడంతో పాటు ఈ-పాస్‌ పుస్తకాన్ని అందచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి ఒక్కో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఈ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను సంబంధిత అధికారులు ఇప్పటికే అందజేశారు. నిర్దేశించిన సమయానికి విక్రయదారు, కొనుగోలుదారు, సాక్షులు డాక్యుమెంట్లతో కార్యాలయానికి చేరుకుంటే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. ఈ లావాదేవీలకు సంబంధించిన లింక్‌ను ఈ ఉదయం సబ్‌ రిజిస్ట్రార్‌లకు అందజేయనున్నారు.

సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష :-
రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం అవుతుండడంతో… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సాంకేతిక అంశాలపై చర్చించారు. నిర్దేశిత సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే హైదరాబాద్‌లోని వార్‌రూంలో సాంకేతిక బృందంతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులంతా ఉదయం నుంచి ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.

మంత్రివర్గ ఉపసంఘం :-
మరోవైపు…వ్యవసాయేతర ఆస్తులు – వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై అన్ని వర్గాలతో మాట్లాడి, అవసరమైన సూచనలు ఇవ్వడం కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం కేసీఆర్ నియమించారు. ఈ కమిటీలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, తలసాని సభ్యులుగా ఉంటారు. మూడు నాలుగు రోజుల పాటు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాలతో సమావేశమై, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని కేసీఆర్ ఆదేశించారు. నగరాలు, పట్టణాల్లో ఎలాంటి సమస్యలున్నాయి..? గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది..? ఇంకా మెరుగైన విధానం తీసుకురావాలంటే ఏమి చేయాలనే తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు సీఎం కేసీఆర్.

70 – 80 రోజుల పాటు ఆగిన రిజిస్ట్రేషన్లు :-
వివిధ కారణాల వల్ల 70 నుంచి 80 రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఇబ్బందులు తలెత్తాయి.. ఇంకా జాప్యం కావద్దని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం వైభవంగా సాగుతోందని.. దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మరింత మెరుగ్గా సాగడానికి వీలుగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని పేదలు సరైన డాక్యుమెంట్లు లేకుండానే ఇళ్లు నిర్మించుకున్నారు.. వారికి కరెంటు బిల్లు, ఇంటి పన్ను, నీటి బిల్లులు వస్తున్నాయి. అలాంటి ఆస్తులను అమ్మే, కొనే సందర్భాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటిని పరిష్కరించడానికి కూడా మార్గం కనిపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.