వ్యవసాయేతర ఆస్తుల నమోదు..ఆధార్ అడగొద్దు – హైకోర్టు

10TV Telugu News

Dharani Portal: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్ వివరాలను తొలగించాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. Dharani Portalలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టులో విచారణ జరిగింది. సాప్ట్ వేర్‌లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని, కులం, కుటుంబసభ్యుల వివరాలు తొలగించాలని సూచించింది.

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని, అయితే ఆధార్ వివరాలు అడగొద్దని కోర్టు స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ కోసం ఇతర గుర్తింపు పత్రాలు అడగొచ్చని తెలిపింది. దాదాపు మూడు నెలల విరామం తర్వాత..వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు పున:ప్రారంభమయ్యాయి. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన క్రమంలో…ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 08వ తేదీ నుంచి నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే.

Dharani Portal ద్వారా నవంబర్ 02వ తేదీ నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. తాజాగా…2020, డిసెంబర్ 14వ తేదీ నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. కానీ.. కొన్ని రోజులుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్ వివరాలు సేకరించడంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.

కొంతమంది హైకోర్టు మెట్లు ఎక్కడంతో విచారణ జరుగుతోంది. ఆస్తుల నమోదుపై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. స్లాట్ బుకింగ్‌ కోసం 29 పేజీల వివరాలు అడుగుతున్నారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం కోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా వ్యవహరిస్తోందని కోర్టు అసంతృప్టి వ్యక్తం చేసినట్లు సమాచారం.

×