Revanth Reddy: తెలంగాణ ప్రగతి భవన్ నుండే ఏపీ జీవో: రేవంత్

కృష్ణా జలాల వాటా విషయంలో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవో తెలంగాణ ప్రగతి భవన్ లోనే తయారైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు చెందిన జలాలను ఏపీ సీఎం జగన్ దోపిడీకి పాల్పడుతున్నారని మంత్రులు మాట్లాడుతున్నారని..

Revanth Reddy: తెలంగాణ ప్రగతి భవన్ నుండే ఏపీ జీవో: రేవంత్

Revanth Reddy

Revanth Reddy: కృష్ణా జలాల వాటా విషయంలో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవో తెలంగాణ ప్రగతి భవన్ లోనే తయారైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు చెందిన జలాలను ఏపీ సీఎం జగన్ దోపిడీకి పాల్పడుతున్నారని మంత్రులు మాట్లాడుతున్నారని.. కృష్ణాలో 811 టీఎంసీలలో సగం వాటా తెలంగాణదే అని సీఎం కేసీఆర్ అంటున్నారని.. తెలంగాణ నీటి వాటా విషయంలో కాంగ్రెస్ మొదటి నుంచి స్పష్టంగా ఉందన్నారు.

కేసీఆర్ తెలంగాణ ప్రజల మనోభావాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. ఏపీ ప్రభుత్వం జీవో 203 ఇచ్చినప్పుడే.. కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేసిందని.. 2020లో అనుమతులు ఇచ్చినప్పుడే కాంగ్రెస్ హెచ్చరించిందని.. నాగం జనార్ధన్ రెడ్డి స్వయంగా.. సీఎం కేసీఆర్ కు చర్యలు తీసుకోవాలని లేఖ రాశారని.. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని.. కృష్ణా బోర్డు వద్దకు నేను స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేశానని ఆ రోజు కేసీఆర్ కిమ్మనకుండా ఉండిపోయారని ప్రశ్నించారు.

నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి రాయలసీమను రతనాల సీమ చేస్తానన్న కేసీఆర్.. బేసిన్లు లేవు.. భేషజాలు లేవని చెప్పలేదా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ఉమాభారతి వద్ద .. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీ లు, ఏపీకి 512 టీఎంసీలని ఒప్పుకున్నారని.. తెలంగాణకు 34 శాతం వాటా చాలని కేసీఆర్, హరీష్ రావు కేంద్రం వద్ద సంతకం చేసిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు.

ఈ రోజు.. కృష్ణాలో సగం వాటా అంటూ కొత్త డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తిన రేవంత్ రాయలసీమ లిఫ్ట్ ను జగన్ అసెంబ్లీలో ప్రకటించి.. జీవో ఇచ్చిన తర్వాత కూడా కేసీఆర్ మాట్లాడలేదన్నారు. రాయలసీమ లిఫ్ట్ పై పాలమూరు రైతు గవినొళ్ల శ్రీనివాస్ ఎన్జీటీలో కేసు వేసి.. స్టే వచ్చాక స్టేట్ గవర్నమెంట్ ఇంప్లీడ్ అయ్యింది. కేంద్రంలో కేసీఆర్ కు అనుకూలమైన ప్రభుత్వమే ఉంది.. ఎందుకు నిలువరించడం లేదని ప్రశ్నించారు.

జూలై 9న జరగాల్సిన కేఆర్ఎంబీ మీటింగ్ ను జూలై 20కి వాయిదా కోరుతున్న కేసీఆర్.. కృష్ణా జలాలను కాపాడటం కన్న మించిన పని ఏముందన్నారు. ఈ ఏడేళ్లలో 1.20 లక్షల కోట్లు ఖర్చు చేసిన ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని.. కృష్ణానదీ జలాలకు సంబంధించి.. ఇప్పటి వరకు ఖర్చు చేసింది కేవలం 30 వేల కోట్లేనన్నారు. పాలమూరు ఎత్తిపోతల విషయంలో.. ఆ జిల్లా అప్పటి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో నేతలందరూ 2016లో నిరసిస్తూ లేఖ రాయగా.. పాలమూరు ఎత్తిపోతలను రెండు టీఎంసీల నుంచి మూడు టీఎంసీలకు పెంచాలని కోరితే.. దాన్ని ఒక టీఎంసీకి తగ్గించారని పేర్కొన్నారు.

కృష్ణా మీద ప్రాజెక్టులను పెండింగ్ పెట్టడంలో కేసీఆర్ కు దురుద్ధేశాలు ఉన్నాయన్న రేవంత్ కృష్ణా జలాల జగడంతో రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిలించి.. ఓట్లు పొందాలనే ఆలోచన చేస్తున్నారన్నారు. ఈ రోజు కృష్ణా జల జగడం కేవలం కేసీఆర్ వల్లేనని.. షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టడంలో పెద్ద కుట్ర ఉందని.. జగన్ కుటుంబ పెద్దగా కేసీఆర్ ను చూడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ ను స్వయంగా ఆహ్వానించిన కేసీఆర్ ఈ రోజు జగన్ .. కాళేశ్వరం అక్రమం అనడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు.

జూలై 9 కృష్ణా బోర్డు మీటింగ్ లో ఖచ్చితంగా తెలంగాణ గొంతు వినిపించాలని కోరిన రేవంత్ మీటింగ్ వాయిదా వేయిస్తే.. జగన్ తో లోపాయకారి ఒప్పందం ఉన్నట్లేనని అనుకోవాల్సిందేనన్నారు. తెలంగాణ విషయంలో చిత్తశుద్ధి ఉంటే.. ప్రధానమంత్రిని ఎందుకు కలవడం లేదని.. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్థ కృష్ణా జలాల విషయంలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలని.. అలా చేస్తే మేమే ఆమరణ నిరాహార దీక్షకు మేం కాపలాగా కూర్చుంటామన్నారు. న్యాయబద్ధంగా రావాల్సిన వాటా కోసం సుప్రీం కోర్టులో కేసు ఎందుకు ఉపసంహరణ చేసుకున్నారని ప్రశ్నించారు. ఈ రోజు అదే కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.