లారీ నుంచి రూ.2.5 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు చోరీ, మెదక్‌లో భారీ దోపిడీ

  • Published By: naveen ,Published On : September 23, 2020 / 12:31 PM IST
లారీ నుంచి రూ.2.5 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు చోరీ, మెదక్‌లో భారీ దోపిడీ

రహదారులపై కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. విలువైన గూడ్స్‌తో వెళ్తున్న కంటైనర్లు టార్గెట్‌గా చేసి దోపిడీలకు పాల్పడుతున్నారు. మెదక్‌ జిల్లా, చేగుంట సమీపంలో కంటెయినర్ లారీలో దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. రెండున్నర కోట్ల రూపాయల విలువైన సెల్‌ఫోన్లను దోచుకెళ్లారు. చెన్నై నంచి ఢిల్లీకి వెళ్తున్న కంటెయినర్‌ నుంచి 2 వేల 442 సెల్‌ఫోన్లను అపహరించారు. పక్కా పథకం ప్రకారం ముందు నుంచే లారీని ఫాలో చేసిన కేటుగాళ్లు.. డ్రైవర్ హోటల్‌ దగ్గర లారీని ఆపిన సమయంలో చోరీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది.

పక్కా ప్లాన్ ప్రకారం కంటైనర్ ను వెంబడించి దోపిడీ:
సెల్‌ ఫోన్ల లోడుతో చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఈ భారీ కంటైనర్‌ను దొంగలు వెంబడించారు. ప్లాన్ ప్రకారం వెంబడించిన కేటుగాళ్లు, తమకు అనుకూలమైన ప్రాంతం రాగానే చోరీకి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. మెదక్ జిల్లా మాసాయిపేట దగ్గర డ్రైవర్, క్లీనర్ భోజనం చేసేందుకు ఓ హోటల్ దగ్గర లారీ ఆపారు. వారు భోజనాలకు లోనికి వెళ్లగానే ఈలోపు దొంగలు రూ.2.5 కోట్ల విలువైన 2,400 సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లిపోయారు.

భోజనం చేసి వచ్చే లోపే చోరీ:
భోజనం తర్వాత డ్రైవర్ వచ్చి చూడగా కంటైనర్ ఖాళీగా కనిపించింది. దీంతో అతడు షాక్ తిన్నాడు. కేవలం భోజనం చేసేంత వ్యవధిలో దొంగలు కంటైనర్ తాళాలు పగలగొట్టి అంత పెద్ద ఎత్తున సరకును తరలించుకుపోవడం విస్మయం కలిగిస్తోంది. వెంటనే డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు దొంగలను పట్టుకునేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

2400 ఫోన్లు, ఖరీదు రూ.2.5 కోట్లు:
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2వేల 400 సెల్ ఫోన్లు… వీటి విలువ అక్షరాల రెండున్నర కోట్లు. కంటైనర్‌లో తరలిస్తుంటే దొంగల ముఠా కన్నేసింది. పక్కా ప్లాన్ తో పకడ్బందీగా ఎవరికి అనుమానం రాకుండా కొట్టేశారు. సెప్టెంబర్ 15న చెన్నై నుంచి ఢిల్లీకి రెడ్‌మీ కంపెనీకి చెందిన రూ.11 కోట్ల విలువైన సెల్‌ఫోన్లను తీసుకుని కంటైనర్‌ బయలుదేరింది. కంటైనర్‌ డ్రైవర్‌ దేవేందర్‌ 16వ తేదీ రాత్రి 44వ జాతీయ రహదారిపై మాసాయిపేట దగ్గర 45 నిమిషాల పాటు ఆపాడు. కంటైనర్‌లో సెల్‌ఫోన్లు తీసుకెళుతున్న విషయం ముందే తెలుసుకున్న దుండగులు అవకాశం కోసం కాచుకుని ఉండి ఇక్కడ అపహరించారు.

సెల్ ఫోన్ల చోరీపై కంపెనీ ప్రతినిధులు చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల పాటు తర్జన భర్జన పడిన పోలీసులు చివరకు కేసు నమోదు చేశారు. కంటైనర్‌ హర్యానాకు చెందినదని, డ్రైవర్‌ యూపీకి చెందినవాడని పోలీసులు తెలిపారు. దొంగల ముఠా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు పోలీసులు.

డ్రైవర్‌ కు తెలియకుండా, కదులుతున్న కంటైనర్ నుంచి 980 మొబైల్ ఫోన్లు చోరీ:
ఇటీవలి కాలంలో లారీల నుంచి సెల్ ఫోన్ల చోరీలు ఎక్కువయ్యాయి. గుంటూరు జిల్లాలో సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. బుధవారం(సెప్టెంబర్ 16,2020) మంగళగిరి-గుంటూరు జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కంటైనర్‌ నుంచి రూ.80లక్షల విలువైన మొబైల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. కంటైనర్ చిత్తూరు జిల్లా శ్రీసిటీ నుంచి కోల్‌కతాకు వెళ్తుండగా ఈ చోరీ జరిగింది. కంటైనర్‌ నుంచి మొత్తం 980 మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్లు సమాచారం.

నిజానికి చోరీ జరిగిన విషయాన్ని కంటైనర్ డ్రైవర్, క్లీనర్ గుర్తించకపోవడం గమనార్హం. కంటైనర్ వెనకాల వెళ్తున్న ఓ వాహనదారుడు కంటైనర్ వెనుక డోర్ తీసి ఉండటాన్ని గమనించి డ్రైవర్‌ను అప్రమత్తం చేశాడు. కొద్ది దూరంలోని కాజా టోల్ గేట్ సమీపంలోకి వెళ్లాక డ్రైవర్ కంటైనర్‌ను రోడ్డుపై నిలిపి కిందకు దిగాడు. వెనక వైపు వెళ్లి చూడగా కంటైనర్ డోర్ తీసి ఉండటం గమనించాడు. అందులో నుంచి భారీ ఎత్తున సెల్‌ఫోన్లు చోరీకి గురైనట్లు గుర్తించాడు. దీంతో క్లీనర్‌తో కలిసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.

డ్రైవర్, క్లీనర్‌ ఏమాత్రం పసిగట్టకుండా కదులుతున్న కంటైనర్ నుంచి దుండగులు మొబైల్ ఫోన్లను ఎలా చోరీ చేశారన్నది ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది దారి దోపిడీలో ఆరితేరిన వాళ్ల పనే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మధ్యప్రదేశ్ ముఠానే ఈ దోపిడీకి పాల్పడి ఉండొచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ముఠాను పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.