లే అవుట్ అనుమతికి రూ.7 లక్షల 50 వేలు లంచం డిమాండ్

లే అవుట్ అనుమతికి రూ.7 లక్షల 50 వేలు లంచం డిమాండ్

RS.7 lakh 50 thousand bribe demand for lay out permission :  తెలంగాణలో రెవెన్యూ అధికారుల తీరు మారట్లేదు. అక్రమార్జన కోసం వెంపర్లాడుతూనే ఉన్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన అవినీతి కేసుల్లో పట్టుబడ్డవారు ప్రాణాలు తీసుకున్న ఉదంతాలున్నా… మిగతావారిలో ఏ మాత్రం భయం కలగట్లేదు. మరో ఇద్దరు రెవెన్యూ అధికారులతో పాటు సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. లే అవుట్‌ అనుమతికి లక్షల రూపాయల తీసుకుంటూ పట్టుబడ్డారు.

లంచాలు తీసుకోవడానికి తెలంగాణ రెవెన్యూ అధికారులు ఏమాత్రం వెనుకాడట్లేదు. మహేశ్వరం మండలం మాన్సాస్‌పల్లి గ్రామ పంచాయితీ పరిధిలో ఐదున్నర ఎకరాల ప్రైవేట్ వెంచర్‌కు లే అవుట్ అనుమతి మంజూరు చేసేందుకు ఏడున్నర లక్షల రూపాయలు డిమాండ్ చేశారు ఉద్యోగులు. ఎంపీడీవో శ్రీనివాస్‌ రెండు లక్షల రూపాయలు తీసుకుంటూ పట్టుబడ్డారు.

ఇదే కేసులో ఐదు లక్షల 50 వేల రూపాయలు తీసుకుంటూ గ్రామ పంచాయితీ సెక్రటరీ గీతతో పాటు సర్పంచ్ రమేష్‌, ఉప సర్పంచ్‌ నరసింహయాదవ్‌ పట్టుబడ్డారు. మహేశ్వరం మండల కార్యాలయంలోనే కాదు…ఈ నలుగురి నివాసాలపై కూడా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. పలు కీలక పత్రాలు సీజ్‌ చేశారు. సోదాల అనంతరం నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఎంపీడీవో శ్రీనివాస్‌…బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని హైదర్‌షా కోట్‌..కపిలానగర్‌లో నివాసముంటాడు. ఇతనికి నాలుగు అంతస్తుల విలాసవంతమైన భవంతి ఉండడంతో ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయారు. ఎంపీడీవో శ్రీనివాస్‌ నివాసంలో సోదాలు చేసిన ఏసీబీ బృందం స్విమ్మింగ్‌పూల్‌, జిమ్‌, మినీ థియేటర్‌ను గుర్తించినట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్లతో పాటు ఖరీదైన మద్యం బాటిళ్లు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను సీజ్‌ చేశారు అధికారులు.

రెవెన్యూ శాఖలో లంచాలు తీసుకుని పట్టుబడ్డవారి జీవితాలు చిన్నాభిన్నమవుతున్నా…చాలామంది ఇంకా చేయి చాస్తూనే ఉన్నారు. లక్షలు, కోట్ల రూపాయల అక్రమార్జన చేస్తున్నారు. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం రెవిన్యూ శాఖను ప్రక్షాళన చేసి ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించాలని చూస్తుంటే…ఉద్యోగులు మాత్రం లంచాలు తీసుకుని కటకటాల్లోకి వెళ్తున్నారు.