తెలంగాణ ఆర్టీసీలో జీతాల జగడం, ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ

తెలంగాణ ఆర్టీసీలో జీతాల జగడం, ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ

Telangana RTC : తెలంగాణ ఆర్టీసీలో జీతాల పెంపు అంశం సంస్థలో రగడకు దారితీస్తోంది. ఈ అంశంపై అధికారులు, ఉద్యోగులు పరస్పరం వేలెత్తి చూపించుకుంటున్నారు. ఫిట్‌మెంట్‌ పెంచితే సంస్థపై అదనపు భారం పడుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించడంపై వివాదం జరుగుతోంది. వేతాలను పెంచితే ఆర్టీసీ నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నది అధికారుల ఆందోళన. జీతాలు పెంచాల్సి వస్తే చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు ఉంచింది. ప్రస్తుతం ఆర్టీసీ వ్యయంలో 52 శాతం మేర జీతభత్యాలకే అవుతోంది. జీతాల భారం 50 శాతం దాటితే ఏ సంస్థ మునుగడైనా కష్టమన్నది ఆర్థిక నిపుణుల సూచన.

అలాంటిది ఆర్టీసీ జీతభత్యాల వ్యయం సగానికి మించిపోయిన తరుణంలో అందుకు అనుగుణంగా ఆదాయం పెంచుకోతప్పదని నివేదించింది. ప్రత్యామ్నాయ ఆదాయం మార్గాలు లేకపోవడంతో చార్జీల పెంపు ఒక్కటే పరిష్కారమని సూచించింది. లేనిపక్షంలో బడ్జెట్‌ రూపంలో వెయ్యి కోట్ల రూపాయలు సమకూర్చూల్సి ఉంటుందని సర్కార్ దృష్టికి తెచ్చింది.  2017 ఏప్రిల్‌ నుంచి ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ జరగాలి. నిబంధనల ప్రకారం ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వేతనాలు పెంచాలి. కానీ నష్టాలతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో వేతన సవరణ పెండింగ్‌లో ఉంది. అలాగే 2021 ఏప్రిల్‌ నుంచి కొత్త వేతన సవరణ జరగాలి. కానీ ఇంతవరకు ఈ గుర్తింపు పొందిన కార్మిక సంఘంతో ఏ స్థాయిలో కూడా చర్చలు జరగలేదు. యాభై నుంచి 60 శాతం ఫిట్‌మెంట్‌ పెంచాలన్న డిమాండ్‌ను కార్మిక సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచాయి.

2018 జులై 1 నుంచి 16 శాతం మధ్యంతర భృతి ఇస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జీతాలు పెంచి.. చార్జీలు పెంచకపోయినా, ప్రభుత్వం సాయం అందకపోయినా.. సంస్థ నిలదొక్కుకోవడం కష్టమన్నది అధికారుల వాదన. దీనిని కార్మిక సంఘాలు తప్పుపడుతున్నాయి. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణతో పాటు.. 2021 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రావాల్సిన వేతన సవరణను ఒకేసారి అమలు చేయాలన్నది కార్మిక సంఘాల డిమాండ్‌. అప్పుడే కార్మికులకు కొంతవరకు మేలు జరుగుతుందంటున్నాయి. అధికారులకు పెంచకపోయినా.. కార్మికులకు పెంచాల్సిన అవసరాన్ని యూనియన్లు గుర్తు చేస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులు, అధికారుల మధ్య ఉప్పు నిప్పుగా మారిన వేతనాల పెంపు అంశంపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.