Remdesivir Injections : రెమిడెసివర్‌ ఇంజెక్షన్ల కోసం బారులు తీరిన జనం..బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠా

కరోనా కాక రేపేస్తోంది. సెకండ్ వేవ్ చుక్కలు చూపించేస్తోంది. ఉన్నట్లుండి పెరిగిపోతున్న కేసులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయ్.. బెడ్స్ ఖాళీ ఉండటం లేదు.

Remdesivir Injections : రెమిడెసివర్‌ ఇంజెక్షన్ల కోసం బారులు తీరిన జనం..బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠా

Sale Of Remdesivir Injections On The Black Market

Sale of Remdesivir Injections on the Black Market : కరోనా కాక రేపేస్తోంది. సెకండ్ వేవ్ చుక్కలు చూపించేస్తోంది. ఉన్నట్లుండి పెరిగిపోతున్న కేసులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయ్.. బెడ్స్ ఖాళీ ఉండటం లేదు. మొదటి దశ చేదు అనుభవాలు ఇంకా వెంటాడుతుంటే ఆక్సిజన్ కొరత ఒకవైపు భయపెడుతోంది. ఊపిరితిత్తుల్లోకి చేరుతున్న వైరస్ మనుషుల ఉసురుతీస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రి పాలవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ బాధితులకు ఇచ్చే మందుల విషయంలో తీవ్ర కొరత ఏర్పడుతోంది.

వైరస్ సోకి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్న వారికి ఆక్సిజన్‌తో పాటు రెమిడెసివిర్ ఇంజక్షన్​లను ఇస్తున్నారు. ఇటీవల ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యతో పాటే రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగం కూడా పెరిగింది. దీంతో ఒక వైపు కరోనా కల్లోలం సృష్టిస్తున్న క్రమంలో కరోనా వైద్యంలో కీలకమైన రెమిడెసివర్ ఇంజెక్షన్ మాత్రం దొరకడం లేదు.

కరోనా కేసులు ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. రెమిడెసివర్ ఇంజక్షన్ కొరత ఉందన్న వార్తలతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో రెమిడెసివర్ ఇంజెక్షన్ల కోసం జనం బారులు తీరారు. శనివారం నుంచి ఇంజక్షన్‌ అందుబాటులో లేదు. స్టాక్‌ వస్తే ఇస్తామని అధికారులు చెప్పడంతో.. రెమిడెసివర్‌ ఇంజెక్షన్ల కోసం ఇంకా వేచిచూస్తున్నారు.

సాయంత్రం 50 మందికి టోకెన్లు ఇస్తామని చెప్పడంతో… జనాలు బారులు తీరారు. కేవలం హైదరాబాదే కాదు.. జిల్లాల నుంచి కూడా ఇంజెక్షన్ల కోసం బాధితులు హైదరాబాద్‌ వస్తున్నారు. రెమిడెసివర్ తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గొడవకు దిగుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

కరోనాతో రెమిడెసివర్‌ ఇంజెక్షన్లు దొరక్కా బాధితులు నానా ఇబ్బందులు పడుతుంటే.. కొంతమంది అక్రమార్కులు ఇదే అదునుగా దందాకు దిగుతున్నారు. మేడ్చల్‌ కు చెందిన ముగ్గురు వ్యక్తులు బ్లాక్‌లో రెమిడెసివర్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బేగంపేట్‌లో వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి వంద రెమిడెసివర్‌ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ముఠా సభ్యులు ఒక్కో ఇంజెక్షన్ ను 15 వేల రూపాయలకు అమ్ముతున్నారు.