తాకకుండానే చేతులు శానిటైజ్‌.. విద్యార్థి వినూత్న ప్రయత్నం

  • Published By: bheemraj ,Published On : June 9, 2020 / 08:27 PM IST
తాకకుండానే చేతులు శానిటైజ్‌.. విద్యార్థి వినూత్న ప్రయత్నం

లాక్‌డౌన్‌ సడలించిన నేపథ్యంలో కరోనా వైరస్ ఏ విధంగా సోకుతుందోనని ప్రజలు వణికిపోతున్నారు. బయటకి వెళ్లి ఇంటికి వచ్చిన ప్రతీసారి చేతులను కడుక్కుంటున్నారు. అయితే ఈ తిప్పలు తప్పించేందుకు మియాపూర్‌ జనప్రియ కాలనీలో నివాసముండే గజవెళ్లి రఘునందన్‌ (బీటెక్‌ ఎంఎల్‌ఆర్‌ఐటీ దుండిగల్‌లో ఈసీ కోర్సు 4వ సంవత్సరం) గుమ్మం ముందు తాకకుండానే చేతులు శానిటైజ్‌ చేసుకునేలా పరికరాన్ని కనిపెట్టాడు.

శానిటైజర్‌ వద్దకు చేరగానే అల్ట్రా సోనిక్‌సెన్సార్‌ మ నుషులను గుర్తించి మైక్రో కంట్రోలర్‌కు సందేశం పంపుతుంది. అప్పుడు వాయిస్‌ రికార్డర్‌ అటోమెటిక్‌గా ప్లే అవుతూ హ్యాండ్‌ యువర్‌ శానిటైజ్‌ అని హెచ్చరిస్తుంది. 

ఈ పరికరాన్ని ఇంటి గుమ్మం ముందర, గేటెడ్‌ కమ్యూనిటీ ఆవరణలో, షాపింగ్‌మాల్స్‌లో ఏర్పాటు చేసుకుంటే దాని వద్దకు రాగానే ఒక వాయిస్‌ రికార్డర్‌ హెచ్చరిస్తుంటుంది. చేతులను శుభ్రంచేసుకో అని అనగానే దాన్ని తాకకుండానే దానికింది భాగంలో పెడితే చేతులు శుభ్రంగా మారుతాయి. దీన్ని అందరికీ అందుబాటు ధరలో మార్కెట్‌లోకి తీసుకువచ్చారు.

కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తన వంతు తోడ్పాటునందిస్తున్నందుకు  సంతోషంగా ఉందని బీటెక్‌ విద్యార్థి రఘునందన్‌ తెలిపారు. రాష్ట్రంలో స్టార్టఫ్‌లకు ప్రోత్సాహం అందించడంతోనే తనలాంటివాళ్లు ధైర్యంగా ముందుకువస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్‌కు తామెప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు.