భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ తిరస్కరణ..మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతి

భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్ తిరస్కరణ..మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతి

secunderabad court rejected Bhooma Akhilapriya’s bail petition : బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురయింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 13 వరకు అఖిలప్రియను పోలీసు కస్టడీకి అనుమతించింది కోర్టు. అఖిలప్రియ మెడికల్ రిపోర్టును చంచల్ గూడ జైలు అధికారులు కోర్టుకు సమర్పించారు. వైద్య నివేదికల్లో అఖిలప్రియ ఆరోగ్యం నార్మల్‌గానే ఉందని తేలడంతో కోర్టు బెయిల్ నిరాకరించింది. చంచల్ గూడ జైలులో ఉన్న అఖిలప్రియను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏ1గా ఉండి అరెస్టైన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సికింద్రాబాద్‌ కోర్టు విచారణ జరిగింది. ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని, కావాలనే కేసులో ఇరికించారని అఖిలప్రియ తరుపు న్యాయవాదులు వాదించగా… అఖిలప్రియకు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను మార్చే అవకాశం ఉందని పోలీసులు గతంలో కోర్టుకు తెలిపారు.

జైలులో అఖిలప్రియ కిందపడడంతో ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చిందని ఆమె తరపు న్యాయవాది శుక్రవారం కోర్టులో మెమో దాఖలు చేయగా.. తక్షణమే ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. దీంతో జైలు అధికారులు అఖిలప్రియను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని రిపోర్టు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను జైలు అధికారులు నేడు కోర్టుకు సమర్పించారు.

ఇక కిడ్నాప్‌ కేసులో ఏ1గా ఉన్న అఖిలప్రియను తమ కస్టడీలోకి ఇవ్వాలన్నారు బోయిన్‌పల్లి పోలీసులు… ఆమె భర్త, అనుచరులను అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్పారు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయాల్సి ఉందని… సంతకాలు చేయించుకున్న దస్త్రాలు సీజ్‌ చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపారు.

అఖిలప్రియ భర్త భార్గవ రామ్‌ అజ్ఞాతంలోకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు భార్గవ రామ్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రోజులు గడిచే కొద్ది ఈ కేసులో ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.