వందే భారత్‌ మిషన్‌లో శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కీలకసేవలు..6500 మంది ప్రయాణికులు రాకపోకలు

  • Published By: bheemraj ,Published On : June 6, 2020 / 09:02 PM IST
వందే భారత్‌ మిషన్‌లో శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కీలకసేవలు..6500 మంది ప్రయాణికులు రాకపోకలు

వందే భారత్‌ మిషన్‌లో శంషాబాద్‌ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టు కీలక సేవలందించింది. ఇక్కడి నుంచి  6500 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూనే కరోనా వ్యాపించకుండా విదేశీయులను వారి దేశాలకు పంపింది. ఇతర దేశాల్లో ఉన్న భారతీయులను ముఖ్యంగా తెలుగు ప్రజలను స్వదేశానికి తెచ్చారు. 

వందే భారత్‌ మిషన్‌లో భాగంగా శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికా, కెనడా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, కువైట్‌, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, సింగపూర్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, కజకిస్తాన్‌, ఉక్రెయిన్‌ తదితర దేశాలకు వందే భారత్‌ ద్వారా శంషాబాద్‌ ఎయిర్ పోర్టు నుంచి సుమారు 34 విమానాలు నడిపించారు. తెలుగు రాష్ట్రాల్లోని 1500 మంది విదేశీయులను వారి దేశాలకు చేర్చడంతో పాటు ఇతర దేశాలకు ఉపాధి కోసం వెళ్లి కరోనా భయంతో తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్న 5000 మందిని రాష్ట్రానికి రప్పించారు. వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచిన తర్వాతే ఇంటికి పంపించారు. 

లాక్‌డౌన్‌ సమయంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సేవలు పూర్తిగా నిలిపివేయకుండా కార్గో సేవలు కొనసాగించారు. వివిధ దేశాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు వస్తు రవాణా చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బంది పనిచేసినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. కార్గోలు, వందే భారత్‌ ప్రత్యేక విమానాలు నడిపిన సిబ్బంది ఎవరూ కరోనా బారిన పడలేదని తెలిపారు.