వైఎస్ షర్మిల పార్టీకి ముహూర్తం ఫిక్స్, ఏప్రిల్ 9న పేరు ప్రకటించే చాన్స్, ఆ రోజునే ఎందుకు ఎంచుకున్నారంటే..

వైఎస్ షర్మిల పార్టీకి ముహూర్తం ఫిక్స్, ఏప్రిల్ 9న పేరు ప్రకటించే చాన్స్, ఆ రోజునే ఎందుకు ఎంచుకున్నారంటే..

sharmila new party announcement date fixed: వైఎస్ షర్మిల పార్టీకి ముహూర్తం ఖరారైందా? పార్టీ, జెండా సిద్దాంతాలు రెడీ అవుతున్నాయా? ఏప్రిల్ లో షర్మిల కొత్త పార్టీ ప్రకటన చేయడానికి కారణమేంటి?

లక్షమందితో బహిరంగ సభ:
తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ లోనే ఆమె పార్టీ పేరు ప్రకటించే అవకాశం ఉంది. ఏప్రిల్ 9న కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో పార్టీని ప్రకటించే చాన్స్ ఉంది. ఖమ్మంలో లక్షమందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 9న పార్టీ ప్రకటించబోయే రోజే పార్టీ పేరు, పార్టీ గుర్తుతో పాటు పార్టీ విధివిధానాలు ఏంటనేది తెలియజేయనున్నారు. మే మొదటి వారంలో పార్టీ ఆఫీస్ కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది.

YS Sharmila with the slogan Jai Telangana

ఏప్రిల్ 9ని ఎంచుకోవడానికి కారణం:
ఏప్రిల్ 9నే పార్టీ పెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేయడం వెనుక కారణం ఉంది. 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఏప్రిల్ 9న ఆరంభమైంది. ఆ యాత్ర దిగ్విజయంగా 60 రోజుల పాటు సాగింది. నాటి టీడీపీ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆ పాదయాత్ర నాందిగా నిలిచింది. ఈ సెంటిమెంట్ తోనే షర్మిల ఏప్రిల్ 9వ తేదీని ఎంచుకున్నట్టుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

డేట్స్ పై రకరకాల ప్రచారాలు:
షర్మిల.. పార్టీ ఏ రోజు పెడతారనే దానిపై రకరకాల వార్తలు వచ్చాయి. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చి మే 14న ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఆ రోజే పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. కాదు కాదు.. జూలై 8న వైఎస్ జయంతి. ఆ రోజున షర్మిల కొత్త పార్టీని ప్రకటిస్తారని ప్రచారం సాగింది. కానీ, ఇప్పుడు ఏప్రిల్ 9వ తేదీని ఫిక్స్ చేశారు.

తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలు రచించే పనిలో బిజీగా ఉన్నారు షర్మిల. సన్నిహితులు, ముఖ్యులతో విసృత్తంగా చర్చలు జరుపుతున్నారు. మరోవైపు తెలంగాణలోని సమస్యలు జిల్లాల వారిగా గుర్తించే పనిలో పడ్డారు. ఇందుకోసం జిల్లాల వారిగా వైఎస్ అభిమానులు, కార్యకర్తలతో వరుస భేటీలు జరుపుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల కార్యకర్తలతో భేటీలు ముగిశాయి. పాలమూరు పార్టీ నేతలతో భేటీ కానున్న షర్మిల, ఉమ్మడి మహబూబ్ నగర్ సమస్యలపై చర్చించనున్నారు.