అతనంటే అందరికీ హఢల్ : అప్పుడు అదృశ్యం..ఇప్పుడు శవం

అతనంటే అందరికీ హఢల్ : అప్పుడు అదృశ్యం..ఇప్పుడు శవం

Shiva

Shiva Murder Mystery : అతనో రౌడీషీటర్.. చిన్న విషయానికే రాద్దాంతం చేస్తాడు.. ఎదురు తిరిగిన వాళ్లను చితకబాదుతాడు. అతన్ని టచ్ చేయాలంటేనే వణికిపోయారు స్థానికులు. అటువంటి వ్యక్తి మూడేళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. ఇంతకీ అతనేమయ్యాడు? స్మశానంలో పోలీసులు బయటకు తెచ్చిన ట్విస్ట్ ఏంటి? అతని పేరు విజయ్ అలియాస్ శివ. అతనంటేనే అందరికీ హడల్. ఎక్కడ కొట్లాట జరిగినా అక్కడ వాలిపోతాడు. తనకు సంబంధం లేని విషయమైనా ఎడాపెడా చితకబాదుతాడు. గొడవ లేనిదే అతనికి రోజు గడవదు. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి మాయమైపోయాడు.

ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన శివ.. ఏ పని చేయకుండా దుబారాగా తిరిగేవాడు. ఎవరితో పడితే వాళ్లతో గొడవ పడుతూ.. కొట్లాటకు దిగేవాడు. తరచూ గొడవలు పెట్టుకుంటూ సైకోలా ప్రవర్తించేవాడు. పోలీసులు బుద్ధి చెప్పినా మారలేదు. దీంతో అతనిపై రౌడీషీట్ కూడా నమోదు చేశారు. అందరినీ హడలెత్తించిన శివ.. 2018 నుంచి కనబడలేదు. బంధువులు, స్నేహితులను ఆరా తీసిన అతని జాడ దొరకలేదు. దీంతో శివ కుటుంబసభ్యులు ఇల్లందు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతను ఎవరెవరికి శత్రువులు ఉన్నారనే విషయాలను వెలికితీశారు. అలా ఓ ముగ్గురిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో వాళ్లను అదుపులోకి తీసుకొని విచారించారు. అప్పుడే అసలు నిజం బయటపడింది. నిందితులు కమల్, రాజ్ కమల్, బాబు రాజ్‌లతో శివకు గొడవ జరిగింది. దీంతో ఇల్లందు జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో క్రికెట్ బ్యాట్‌తో శివపై దాడి చేశారు. తీవ్రగాయాలతో శివ స్పాట్‌లోనే చనిపోయాడు. అనంతరం మృతదేహాన్ని రాజీవ్ కాలనీలోని స్మశానవాటికలో పూడ్చి పెట్టి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.