పెళ్లి పేరుతో వ్యాపారి నుంచి 11కోట్లు నొక్కేసిన నకిలీ ఐపీఎస్ స్మృతి కేసులో మతిపోయే వాస్తవాలు

పెళ్లి పేరుతో వ్యాపారి నుంచి 11కోట్లు నొక్కేసిన నకిలీ ఐపీఎస్ స్మృతి కేసులో మతిపోయే వాస్తవాలు

shocking facts in fake ips smrithi sinha case: పెళ్లి పేరుతో మైనింగ్ వ్యాపారి నుంచి ఏకంగా 11కోట్లు కొట్టేసిన నకిలీ ఐపీఎస్ స్మృతి సిన్హా కేసు విచారణలో దిమ్మతిరిగే విషయాలు బయటపడుతున్నాయి. స్మృతి సిన్హా ఆమె గ్యాంగ్ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. స్మృతి సిన్హా లేడీ కాదు కిలేడీ అంటున్నారు పోలీసులు. స్మృతి సిన్హాతో పాటు ఆమె గ్యాంగ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి 5 ఖరీదైన కార్లు, రూ.6 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

చదివింది పదే..సినిమాల్లో నటిద్దామని వచ్చి..
స్మృతి సిన్హా అసలు పేరు శిరీష(39). ఆమెది కడప. పదో తరగతి చదివింది. బాల్య వివాహం చేసుకున్న శిరీషకు ఇద్దరు పిల్లలు పుట్టారు. పదేళ్ల క్రితం భర్తతో విడిపోయిన శిరీష హైదరాబాద్‌కి మకాం మార్చింది. సినిమాల్లో హీరోయిన్ కావాలనే కోరికతో స్మృతి సిన్హాగా పేరు మార్చుకుని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి నటనలో శిక్షణ తీసుకుంది. చాన్సులు రాకపోవడంతో ఆరేళ్ల కిందట బోరబండలో ఓ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించింది. మార్కెట్ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ కోసం వచ్చే విజయ్ కుమార్ రెడ్డితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత ఇద్దరూ సహజీవనం ప్రారంభించారు. అప్పటి నుంచే చిన్నచిన్న మోసాలకు పాల్పడేవారు.

నకిలీ ఐపీఎస్ పేరుతో బురిడీ:
మూడేళ్ల కిందట బాచుపల్లిలోని ప్రణవ్ ఆంటిలియాలోని విల్లాకు స్మృతి సిన్హా దంపతులు మకాం మార్చారు. తమ పొరుగున ఉంటున్న మైనింగ్ వ్యాపారి వీరారెడ్డితో పరిచయం పెంచుకున్నారు. వాలీబాల్ ఆడే క్రమంలో వీరారెడ్డితో విజయ్ కుమార్‌ రెడ్డి మచ్చిక చేసుకున్నాడు. తాను ట్రైనీ ఐపీఎస్ నంటూ నమ్మబలికాడు. తన భార్య స్మృతి సిన్హా అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో సౌత్ ఇండియా చైర్‌పర్సన్ అంటూ నమ్మించాడు. ఖరీదైన కార్లలో సైరన్ వేసుకుని తిరగడం.. నకిలీ ఐడీ కార్డులు చూసి వీరారెడ్డి వారిని నమ్మేశాడు.

కట్టుకథలు చెప్పి రూ.11.50కోట్లు వసూలు:
ఆ తర్వాత విజయ్ కుమార్ తో పాటు అతని సహచరి స్మృతి సిన్హా.. వీరారెడ్డిని మోసం చేస్తూ వచ్చారు. కట్టుకథలు చెప్పి సుమారు 11.50 కోట్ల రూపాయల నగదును తమ ఖాతాలో వేయించుకున్నారు. ఈ డబ్బుతో విజయ్ కుమార్, స్మృతి.. విలాసవంతమైన జీవితం గడిపారు. ఖరీదైన 5 కార్లు, బంగారం, ఓ విల్లా కొనుగోలు చేశారు. ఈ కుంభకోణానికి విజయ్ కుమార్ రెడ్డి, స్మృతి ల బంధువులు మరో ముగ్గురు సహకరించారు.

పరువు పోతుందని ఆత్మహత్య:
తన బావమరిదికి పెళ్లి చేయాలనుకుంటున్నట్లు వీరారెడ్డి చెప్పడంతో తన సోదరి ప్రవల్లిక ఉందని.. ఆమెనిచ్చి పెళ్లి చేద్దామంటూ ఇంటర్నెట్‌ నుంచి ఓ అందమైన యువతి ఫొటోను వీరారెడ్డి కుటుంబ సభ్యులకు చూపించాడు విజయ్. అప్పటి నుంచి అతని బావమరిదితో స్మృతినే ప్రవల్లికలా మాట్లాడుతూ కవ్వించేది. దీంతో ప్రవల్లికతో పెళ్లి చేసేందుకు వీరారెడ్డి భార్య కుటుంబం ఒప్పుకుంది.

ఫొటోలతో బాగోతం బట్టబయలు:
కాగా, పెళ్లి ఖర్చుల కోసం తాను ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని విజయ్ కుమార్ రెడ్డిపై వీరారెడ్డి ఒత్తిడి తెచ్చాడు. అయితే విజయ్ తప్పించుకుని ప్రారంభించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత విజయ్ కి ఫోన్ చేసిన వీరారెడ్డి.. వెంటనే డబ్బు ఇవ్వాలని, లేదంటే బాగుండదని వార్నింగ్ ఇచ్చాడు. తాను డెహ్రాడూన్ లో శిక్షణలో ఉన్నానని విజయ్ తప్పించుకున్నాడు. మార్ఫ్ చేసిన ఫొటోలు పంపాడు. అవి మార్ఫ్ చేసిన ఫొటోలు అని తెలియడంతో వీరారెడ్డికి అనుమానాలు పెరిగాయి. తాను మోసపోయానని తెలుసుకున్న వీరారెడ్డి.. విజయ్ సిటీలోనే ఉన్నాడని తెలిసి అతడిపై ఒత్తిడి పెంచాడు. తప్పించుకునే దారి లేకపోవడంతో విజయ్ కుమార్.. నిజం చెప్పేశాడు. వీరారెడ్డిని మోసం చేసినట్టు అంగీకరించాడు. ఈ విషయాన్ని వాట్సాప్ ద్వారా ఫిబ్రవరి 5న మెసేజ్ పంపాడు. ఆ తర్వాత పరుపు పోతుందనే భయంతో విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ వీడియో ఆధారంగా వీరారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో స్మృతి సహా నలుగురు నిందితులను(స్మృతి సహా విజయ్ తండ్రి రాఘవ రెడ్డి, బంధువులు రామకృష్ణరెడ్డి, రణధీర్ రెడ్డి) బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల నుంచి ఫేక్ ఐడీ కార్డులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, రూ.50లక్షలు ఖరీదు చేసే బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లు, 4కోట్లు ఖరీదు చేసే 3 బీఎండబ్ల్యూ కార్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బాచుపల్లిలో కోటిన్నర ఖరీదు చేసే విల్లాకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.