Telangana : రెండు గ్రామాల మధ్య ‘టోల్’ హీట్…అమ్మవారి పేరుతో వసూళ్లు..

మా ఊళ్లోని గుడికి రావాలంటే.. టోల్ కట్టాల్సిందేనని వాళ్లు. అవునా.. అయితే.. మా ఊరి మీదుగా వెళ్లాలంటే.. టోల్ చెల్లించాల్సిందేనని వీళ్లు. ఇలా.. ఆ రెండు ఊళ్ల మధ్య కొత్తగా వసూళ్ల పంచాయతీ మొదలైంది.

Telangana : రెండు గ్రామాల మధ్య ‘టోల్’ హీట్…అమ్మవారి పేరుతో వసూళ్లు..

Sirisilla District Ananthagiri Tollgate Dispute Between Pedda Lingapur

KNR TOLL GATE WAR : మా ఊళ్లోని గుడికి రావాలంటే.. టోల్ కట్టాల్సిందేనని వాళ్లు. అవునా.. అయితే.. మా ఊరి మీదుగా వెళ్లాలంటే.. టోల్ చెల్లించాల్సిందేనని వీళ్లు. ఇలా.. ఆ రెండు ఊళ్ల మధ్య కొత్తగా వసూళ్ల పంచాయతీ మొదలైంది. గుడి కోసమే.. టోల్ డబ్బులు వసూలు చేస్తున్నామని టెండర్ దక్కించుకున్నోళ్లు చెబుతుంటే.. ఆలయానికి సరిపడా నిధులున్నాయని.. ఎండోమెంట్ అధికారులు అంటున్నారు. అంతా క్లియర్‌గా ఉన్నప్పుడు.. టోల్ గేట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. ఆ టోల్‌కు.. కౌంటర్ టోల్ ఎందుకు వసూలు చేయాల్సి వస్తోంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా.. ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి – పెద్ద లింగాపూర్ గ్రామాల మధ్య.. కొత్తగా టోల్ గేట్ పంచాయతీ మొదలైంది. అనంతగిరి గ్రామంలో.. టోల్ గేట్ ఏర్పాటు చేసి.. పక్కనే ఉన్న పెద్ద లింగాపూర్ గ్రామస్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తుండటం లోకల్‌గా పెద్ద రచ్చకే దారితీసింది. అరె.. పక్క ఊరోళ్లం. ముఖం కూడా చూడకుండా.. మా నుంచి టోల్ వసూలు చేసుడేంది అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. పెద్ద లింగాపూర్ గ్రామస్తులు.. అనంతగిరి గ్రామం మీదుగా వెళ్లినా.. డబ్బులు సమర్పించుకోవాల్సిందేనని టోల్ గేట్ నిర్వాహకులు చెప్పేశారు. దీంతో.. కౌంటర్‌గా పెద్దలింగాపూర్ గ్రామస్తులు.. తమ గ్రామం మీదుగా.. అనంతగిరి వాసులు వెళ్లాలంటే.. టోల్ కట్టాల్సిందేనని కొత్త దుకాణం తెరిచారు.

అసలు.. అనంతగిరిలో టోల్ గేట్ ఎందుకు వెలిసిందంటే.. ఆ ఊళ్లో ప్రసిద్ధి చెందిన పోచమ్మ ఆలయం ఉంది. కోరిన కోరికలు నెరవేర్చే దేవతగా.. ఆమెను కొలిచేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. దీనిని అదనుగా భావించిన కొందరు.. దారిలో టోల్ గేట్ ఏర్పాటు చేసుకొని.. గుడికి వచ్చే భక్తుల నుంచే కాకుండా.. ఆ దారిన వచ్చే ప్రతి ఒక్కరి నుంచి టోల్ వసూలు చేస్తున్నారు. టూ వీలర్స్‌కి 20 రూపాయలు మొదలుకొని.. వాహనాన్ని బట్టి.. వంద దాకా వసూలు చేస్తున్నారు. అంతేకాదు.. ఆ దారిగుండా పొలం పనులకు వెళ్లే వారిని, కల్లుగీత కార్మికులను, అనంతగిరి ప్రాజెక్ట్ చూసేందుకు వచ్చే పర్యాటకులను.. ఎవరినీ వదిలిపెట్టకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదేమిటంటే.. గ్రామ పంచాయతీ నిర్వహించిన వేలంలో.. 4 లక్షలకు టెండర్ దక్కించుకున్నామని సమాధానం చెబుతున్నారు.

అనంతగిరి గ్రామ పరిధిలో.. పెద్ద లింగాపూర్ గ్రామస్తులకు సంబంధించిన పొలాలు, బంధువుల ఇళ్లు ఉన్నాయి. ఈ రెండు ఊళ్ల మధ్య.. తరచుగా రాకపోకలు ఉంటాయ్. ఇప్పుడు.. పెద్దలింగాపూర్ గ్రామస్తులు.. అనంతగిరికి వస్తే టోల్ వసూలు చేస్తుండటం.. ఆగ్రహం తెప్పిస్తోంది. పక్క ఊరోళ్లకు టోల్ ఏమిటంటూ.. అధికారులకు కంప్లైంట్ చేశారు పెద్దలింగాపూర్ వాసులు. అయితే.. వాళ్లు పట్టించుకోకపోవడంతో.. తమ ఊరి దారిలో వాళ్లే.. కొత్తగా మరో టోల్ గేట్ ఏర్పాటు చేశారు. అనంతగిరి గ్రామస్తులు.. పెద్దలింగాపూర్ మీదుగా వెళ్లాలంటే.. వంద రూపాయలు కట్టాల్సిందేనని తీర్మానించారు. ఇదే.. ఇప్పుడు రెండు గ్రామాల మధ్య పంచాయతీ ముదిరేలా చేసింది.అనంతగిరి గ్రామానికి చెందిన టోల్ గేట్ నిర్వాహకులు.. టోల్ వసూళ్ల ద్వారా వచ్చిన డబ్బులను.. పోచమ్మ ఆలయ ప్రాంగణంలో శానిటేషన్ పనుల కోసం వినియోగిస్తామని చెబుతున్నారు. అయితే.. ఆలయానికి నిధుల కొరత లేదని.. ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ నిధులు కేటాయిస్తోందని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు.

టోల్‌గేట్‌కి, ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పినా.. ఎందుకు గుడి పేరు మీద వసూళ్లు చేస్తున్నారని.. పెద్ద లింగాపూర్ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడుగుతున్నారు. కొన్ని రోజుల కిందటి వరకు ప్రశాంతంగా ఉన్న రెండు ఊళ్ల మధ్య.. ఒక్క టోల్ గేట్ చిచ్చు రాజేసింది. కౌంటర్ టోల్ గేట్ పెట్టి.. డబ్బులు వసూలు చేసేదాకా పరిస్థితులు వచ్చాయి. మున్ముంది.. ఇది ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది.