Telangana Airports : తెలంగాణలో మరో 6 ఎయిర్‌పోర్టులు

తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టులు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా మరో 6 విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమాధానం ఇచ్చారు.

Telangana Airports : తెలంగాణలో మరో 6 ఎయిర్‌పోర్టులు

Telangana Airports

Telangana Airports : తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టులు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం రెండు ఎయిర్ పోర్టులు ఉన్నాయి. కొత్తగా మరో 6 విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమాధానం ఇచ్చారు.

” నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం మూడు గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులకు, వరంగల్‌ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లో మొత్తం మూడు బ్రౌన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులకు వచ్చిన ప్రతిపాదనలపై టెక్నో ఎకనామిక్‌ ఫీజిబిలిటీ స్టడీ రిపోర్ట్‌ను ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఎఐ) పూర్తి చేసింది. ఈ నివేదికను ఈ నెల 7న తెలంగాణ ప్రభుత్వానికి ఎఎఐ సమర్పించింది. ప్రతిపాదిత మూడు గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులకు సంబంధించిన స్థల ఎంపిక అనుమతులను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్ర పౌర విమానయాన శాఖకు ఇవ్వలేదు” అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.

రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణం గల భధ్రాద్రి జిల్లాలో ఎయిర్‌ పోర్ట్‌ ఏర్పాటుకు టెక్నికల్‌ సర్వే బృందం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విమానాశ్రయం ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమర్పించింది. దీంతో జిల్లా వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ పారిశ్రామిక జిల్లాగా పేరుగాంచింది. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు పరిశ్రమలకు అనుకూలంగా ఉండటంతో కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు పట్టణాల్లో సింగరేణి బొగ్గు గనులు, సారపాకలో ఐటీసీ, అశ్వాపురంలో భారజల కర్మాగారం, పాల్వంచలో కేటీపీఎస్, నవభారత్, ఎన్‌ఎండీసీ, మణుగూరు- పినపాక మండలాల సరిహద్దులో బీటీపీఎస్‌ వంటి అతి పెద్ద సంస్థలకు నిలయంగా మారింది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత గలదిగా పేరుగాంచింది. రామయ్య దర్శనానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఇక ఆయా పరిశ్రమల్లో పనిచేసేందుకు, ఇతర అవసరాల కోసం సైతం అనేక ప్రాంతాల నుంచి వస్తుంటారు. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే వీరందరికీ ఎంతో ఉపయోగంగా ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ నిబంధనల ప్రకారం శంషాబాద్‌ విమానాశ్రయానికి 240 కి.మీ.దూరం లోపు మరో ఎయిర్‌పోర్ట్‌ నిర్మించకూడదు. కానీ హైదరాబాద్‌ నుంచి కొత్తగూడెం జిల్లా కేంద్రం 300 కి.మీ.దూరంలో ఉంటుంది. అంతేకాకుండా జిల్లాకు ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు సరిహద్దులో ఉన్నాయి. ఈ కారణాలతో కొత్తగూడెంలో విమానాశ్రయ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు ఉండవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా తాజాగా వరంగల్, ఆదిలాబాద్, బసంత్‌నగర్‌(పెద్దపల్లి), జక్రాన్‌పల్లి(నిజామాబాద్‌), పాల్వంచ(కొత్తగూడెం), దేవరకద్ర(మహబుబ్‌ నగర్‌)లలో కొత్తగా డొమెస్టిక్‌(దేశీయ) విమానాశ్రయాలను ఫేస్‌-1, ఫేస్-2లో ఏర్పాటు చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి.