Anganwadi Snakes : బాబోయ్.. అంగన్‌వాడీ కేంద్రంలో 40 పాములు, తేళ్లు

అభం శుభం తెలియని చిన్నారులుండే అంగన్ వాడీ కేంద్రంలో విష సర్పాలు, తేళ్లు కలకలం రేపాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 పాము పిల్లలు, రెండు తేళ్లు దర్శనం ఇచ్చాయి.

Anganwadi Snakes : బాబోయ్.. అంగన్‌వాడీ కేంద్రంలో 40 పాములు, తేళ్లు

Snake Babies

snake babies found in anganwadi centre : అభం శుభం తెలియని చిన్నారులుండే అంగన్ వాడీ కేంద్రంలో విష సర్పాలు, తేళ్లు కలకలం రేపాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 పాము పిల్లలు, రెండు తేళ్లు దర్శనం ఇచ్చాయి. మహబూబాబాద్ జిల్లాలోని అంగన్ వాడీ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లిలోని ఒకటవ అంగన్ వాడీ కేంద్రంలో బయటపడిన 40పాము పిల్లలు అందరిని కలవరపరిచాయి.

మామూలుగా ఒక పామును చూస్తే గుండె జలదరిస్తుంది. అలాంటిది ఏకంగా 40 పాము పిల్లలు కనబడితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. స్కూల్ తలుపులు తీసిన వెంటనే పాము పిల్లలు చూసిన టీచర్ శ్రీజ్యోతి భయపడిపోయింది. వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పింది. అంగన్ వాడీ కేంద్రంలోని బండలను తొలగించగా 40 పాము పిల్లలతో పాటు రెండు తేళ్లు కూడా బయటకు వచ్చాయి.

ముందు కాస్త బిత్తరపోయిన స్థానికులు తర్వాత తేరుకుని వాటన్నింటినీ చంపి బయట పడేశారు. అయితే ఆ సమయంలో అంగన్​వాడీ కేంద్రంలో పిల్లలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టు అయింది.

అంగన్ వాడీ భవనం శిథిలావస్థకు చేరడంతో పాములు, విష పురుగులు వస్తున్నట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. వెంటనే పాత భవనాన్ని తొలగించి కొత్తది నిర్మించాలని కోరుతున్నారు. కాగా, చిన్నారులు ఉండే కేంద్రంలో విష పురుగులు రావడం స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. తమ పిల్లలను అంగన్ వాడీ కేంద్రాలకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు.

అంగన్ వాడీ కేంద్రంలో పాము కరిచి చిన్నారి మృతి:
కొన్ని రోజుల క్రితం ఏపీలోని కృష్ణా జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అంగన్ వాడీ కేంద్రంలో పాముకాటుకు చిన్నారి బలైంది. బంటుమిల్లి మండలంలో రామవరపుమోడిలో ఈ విషాదం జరిగింది. అక్కతో కలిసి మూడేళ్ల వయసున్న చిన్నారి స్వాతి అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లింది. అక్కడ తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న సమయంలో… కోడిగుడ్ల ట్రే పక్కనే ఉన్న ఓ పాము స్వాతిని కాటేసింది. నొప్పితో చిన్నారి ఏడవడంతో అంగన్‌వాడీ కేంద్రం సిబ్బంది ఇంటికి పంపించారు. కానీ పాము కరించిందని ఎవరికీ తెలియదు.

పాప ఏడూస్తూ చేయి చూపించడంతో.. పాము కరిచిందని తల్లిదండ్రులు అనుమానించారు. మొదట గ్రామంలోనే నాటు వైద్యం చేయించారు. అనంతరం గ్రామస్తుల సలహాతో కృత్తివెన్ను మండలంలోని చిన్నపాండ్రాక ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేశారు. పాప ఆరోగ్య పరిస్థితి విషమించిందని పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. పాపను మచిలీపట్నం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లుండగా మార్గమధ్యలోనే అంబులెన్స్‌లో కన్నుమూసింది. స్నేహస్వాతి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

రామవరపుమోడి గ్రామంలో అంగన్ వాడీ కేంద్రానికి శాశ్వత భవనం లేదు. కొన్నేళ్లుగా పంచాయతీ భవనంలోనే నిర్వహిస్తున్నారు. అది కూడా శిథిలావస్థకు చేరుకుంది. భవనానికి ప్రహరీ లేకపోవడం, చుట్టుపక్కల పొదలు ఉండడంతో.. క్రిమి కీటకాలు, పాములు, విష పురుగులు వస్తున్నాయని స్థానికులు వాపోయారు. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.