Water In Paper Boxes : పేపర్ బాక్సుల్లో మినరల్ వాటర్ సప్లై..సాఫ్ట్ వేర్ కుర్రాళ్ల వినూత్న ఐడియా

వాటర్ బాటిల్స్ అన్నీ ప్లాస్టిక్ తో తయారు చేసినవే. కానీ పేపర్ బాక్స్ లో వాటర్ సప్లై గురించి ఎక్కడా విని ఉండరు. ఇద్దరు యువ సాప్ట్ వేర్ ఇంజనీర్ కుర్రాళ్లు ఇటువంటి వినూత్న ఐడియా వేశారు. ఐడియా వేయటమే కాదు దాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఈ పేపర్ వాటర్ బాటిల్స్ సప్లై చేస్తు శెభాష్ అనిపించుకుంటున్నారు.

10TV Telugu News

Caro Mineral water paper boxes : నీళ్ల నుంచి ఫుడ్ ప్యాకింగ్ వరకు.. ప్రతీదాంట్లో ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. ప్లాస్టిక్. ఎక్కడచూసినా ప్లాస్టిక్ మయమే. ఇది పర్యావరణానికి పెను ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వల్ల ప్రమాదం అంతా ఇంతా కాదు. అందుకే నీళ్లను ప్లాస్టిక్ బాటిల్స్ లో కాకుండా..పేపర్ బాక్సులో అందించేలా వినూత్న ఐడియాకు శ్రీకారం చుట్టారు ఇద్దరు సాప్ట్ వేర్ కుర్రాళ్లు. అదేంటీ నీళ్లను పేపర్ బాక్సులోనా..బాక్సు నానిపోదా? అనే డౌట్ వస్తుంది. అక్కడే ఉంది ఈ సాఫ్ట్ వేర్ కుర్రాళ్ల తెలివి. మంచినీళ్లు ఎలా తెస్తారు అంటే?ఏముంది క్యాన్లు, బాటిళ్లే కదా? అని తేలిగ్గా అనేస్తాం. కానీ అలా కాదు ప్లాస్టిక్ బాటిల్ లో కాకుండా..పేపర్ బాక్సుల్లో సప్లై చేస్తామంటూ..ఓ వినూత్న ఐడియాతో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ కుర్రాళ్లు ముందుకొచ్చారు. వారే చైతన్య, సునీత్‌ తాతినేని. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న వాటర్‌ బాటిళ్లలో 10శాతం మాత్రమే రీసైకిల్‌ అవుతున్నాయ్. మిగతా 90శాతం భూమిలోకి లేదా సముద్రంలోకి చేరుతున్నాయని అంచనా. వాటివల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతోంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేలా దేశంలోనే తొలిసారి పేపర్‌ బాక్స్‌లో మినరల్‌ వాటర్‌ను అందించాలనే ఐడియా వేశారు చైతన్య, సునీత్‌ తాతినేని.

కారో అనే యాప్‌ సాయంతో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించి… పలు గేటెడ్‌ కమ్యూనిటీలకు యాప్‌ ఆధారిత సేవలను అందిస్తున్నారు వీరిద్దరూ. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసేటప్పుడు, ఇంట్లోనూ తాము ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో బ్రాండెడ్‌ వాటర్‌ను మాత్రమే తాగేవాళ్లమని..దీంతో ఇంట్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పెరిగిపోతుండడంతో ఈ సమస్య పరిష్కారానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు.అలా వచ్చిన ఆలోచనే ఈరోజు పేపర్ బాక్సులో మంచినీళ్లు సప్లై.పర్యావరణ అనుకూల కార్టన్‌ బాక్సులను ఇటీవలి కాలంలో పలు కంపెనీలు ఇంజిన్‌ ఆయిల్స్‌, జ్యూస్‌ల ప్యాకింగ్‌కు వినియోగిస్తున్నాయ్. అదే టెక్నాలజీని వాటర్‌ బాక్స్‌ల్లో కూడా వినియోగించారు వీరిద్దరు. భారతదేశంలో మంచి నీటి కోసం ఈ తరహా బాక్స్‌ను రూపొందించిన తొలి సంస్థ తమదే అంటున్నారు సునీత్‌.

కేవలం పర్యావరణాన్నేగాక.. వినియోగదారుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పేపర్ బాక్సుల్లో వాటర్ సప్లైను రూపొందించామని తెలిపారు. ఒక రోజులో మనిషికి అవసరమైన రాగిలో 20శాతాన్ని ఈ నీటిలో యాడ్ చేసామని..రాగి చెంబులో నీళ్లు రాత్రంతా ఉంచుకుని ఉదయమే తాగే అవకాశం లేని వారికి ఇది చాలా చక్కటి అవకాశమని అంటున్నారు. అంతేకాదు ఈ పద్ధతిలో ఆయుర్వేద ప్రయోజనం కూడా ఉందంటున్నారు. ‘కారో’పేపర్‌ వాటర్‌ బాటిల్స్‌ను 5, 10, 20 లీటర్‌ కార్టన్స్‌లో అందిస్తున్నారు. ప్రతి కార్టన్‌కూ ప్రత్యేకంగా ట్యాప్‌ ఉండటం వల్ల బాక్సులో వాటర్ వేస్ట్ కాకుండా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కొన్ని సూపర్‌మార్కెట్‌లలో ఈ కారో వాటర్ బాటిల్స్ 5 లీటర్ల కార్టన్స్‌ దొరుకుతున్నాయి. కారో వాటర్‌ యాప్‌ ద్వారా హోమ్‌ డెలివరీని చందా రూపంలో అందిస్తున్నారు వీరిద్దరు.

కార్టన్‌ను తిరిగి అందజేస్తే రివార్డ్‌ పాయింట్లు కూడా ఇస్తామని..అనవసరంగా ల్యాండ్‌ఫిల్స్‌కు చేర్చకుండా రీసైకిల్‌ చేయడమే ఈ పాయింట్ల వెనక ఉద్దేశమని చెప్తున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్‌లోనే సేవలనందిస్తున్న వీరు.. త్వరలోనే బెంగళూరు, వైజాగ్‌లకు తమ కారో వాటర్ బాక్స్ లను విస్తరించనున్నామని తెలిపారు. రాబోయే మూడు నాలుగేళ్లలో వందకోట్ల టార్గెట్ రీచ్ కావడమే తమ లక్ష్యమంటున్నారు ఈ ఇద్దరు కుర్రాళ్లు. వీరి ఐడియాకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

10TV Telugu News