అర్థరాత్రి తల్లి మొబైల్‌తో కొడుకు ఘనకార్యం.. అసలు విషయం తెలిసి షాక్‌లో పోలీసులు

అర్థరాత్రి తల్లి మొబైల్‌తో కొడుకు ఘనకార్యం.. అసలు విషయం తెలిసి షాక్‌లో పోలీసులు

Smart Phone : ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ అందరి జీవితాల్లో ఓ భాగమైపోయింది. ఇప్పుడు దాదాపు అన్ని ముఖ్యమైన పనులూ స్మార్ట్ ఫోనో లోనే జరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ రాకతో జీవితం ఈజీగా మారింది. ఇది మంచి విషయమే. అదే సమయంలో స్మార్ట్ ఫోన్లు కొంపలు ముంచుతున్నాయి. వీటి కారణంగా నేరాలు, ఘోరాలు జరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. అర్థరాత్రి తల్లి మొబైల్ తో ఓ కొడుకు చేసిన ఘనకార్యం పోలీసులకే కాదు ఆ తల్లికి కూడా దిమ్మతిరిగిపోయేలా చేసింది.

బ్యాంకు నుంచి వచ్చిన స్టేట్‌మెంట్ చూసి ఓ మహిళ కంగుతింది. తన అకౌంట్ నుంచి 4 లక్షలు డెబిట్ అయినట్లు కనిపించడంతో షాక్‌కి గురైంది. అర్ధరాత్రి వేళ తన యూపీఐ అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్సఫర్ అయినట్లు గమనించిన ఆమె.. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఖాకీలు రంగంలోకి దిగడంతో దర్యాఫ్తులో అంతకుమించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

హిమాయత్‌నగర్ లో నివాసం ఉంటున్న ఓ మహిళ తన బ్యాంకు ఖాతా నుంచి ఆన్‌లైన్ చెల్లింపులు చేస్తూ ఉంటుంది. కొన్నిరోజుల కిందట తన బ్యాంకు స్టేట్‌మెంట్ చూసుకున్న ఆమె షాక్‌కి గురైంది. నాలుగు లక్షలు ఖర్చు చేసినట్లు ఉండడంతో దిమ్మతిరిగింది. ఆ డబ్బు ఆమె ఖర్చు చెయ్యలేదు. దీంతో వెంటనే ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలి కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ నుంచే చెల్లింపులు జరిగినట్లు దర్యాఫ్తులో గుర్తించారు.

దర్యాఫ్తులో వారికి ఓ క్లారిటీ వచ్చింది. ఇది బయటి వ్యక్తుల పని కాదని, కుటుంబ సభ్యుల పనే అని నిర్ధారించుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ జరపడంతో షాకింగ్ నిజం వెలుగుచూసింది. బాధితురాలి కొడుకు నిర్వాకం బయటపడింది. టెన్త్ క్లాస్ చదువుతున్న ఆమె కొడుక్కి ఆన్ లైన్ గేమ్స్ అంటే పిచ్చి. అర్ధరాత్రి అంతా నిద్రపోయాక అతడు తల్లి ఫోన్ తీసుకునేవాడు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాడు. ఈ క్రమంలో తల్లి ఫోన్ నుంచి డబ్బు చెల్లించేవాడు. చెల్లింపులను నిర్ధారించేందుకు వచ్చే ఓటీపీలను ఎంటర్ చేసిన తర్వాత వాటిని డిలీట్ చేసేవాడు. దీంతో అవి ఆమె కంటపడేవి కావు. చివరికి బ్యాంకు స్టేట్ మెంట్ తో అతడి వ్యవహారం వెలుగుచూసింది. పోలీసు విచారణలో కొడుకు నిర్వాకం బయటపడడంతో బాధితురాలు బిక్కముఖం వేసింది. ఆ 4 లక్షలు ఖర్చు చేసిందే కొడుకే అని తెలిసి తల పట్టుకుంది. సో, తల్లిదండ్రూలూ బీకేర్ ఫుల్. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చూస్తున్నారు? అని నిత్యం ఓ కంట కనిపెట్టండి. అడిగిందల్లా వారికి కొనివ్వడంతో బాధ్యత తీరిపోదూ. వారిపై నిఘా లేకపోతే ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు.