అయ్యో పాపం, కరోనా సోకిందని కన్నతల్లిని పొలంలో వదిలేసిన కొడుకులు

  • Published By: naveen ,Published On : September 7, 2020 / 03:13 PM IST
అయ్యో పాపం, కరోనా సోకిందని కన్నతల్లిని పొలంలో వదిలేసిన కొడుకులు

కరోనా వైరస్ మహమ్మారి మనుషుల ప్రాణాలనే కాదు మనిషిలోని మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. మనుషుల మధ్య బంధాలను, అనుబంధాలను, ప్రేమానురాగాలను దూరం చేస్తోంది. మనుషులను ఎంత కఠినాత్ములుగా మారుస్తోందంటే, ఏకంగా కన్నవారినే రోడ్డున వదిలేసేంతగా. కరోనా సోకిందనే కారణంతో ఆ వృద్ధురాలి కొడుకులు అమానవీయంగా వ్యవహరించారు. కన్న తల్లి అని కూడా చూడకుండా ఏమాత్రం కనికరం లేకుండా పొలంలో ఒంటరిగా వదిలేసి వెళ్లారు. నీ చావు నువ్వు చావు అని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. వృధ్దాప్యంలో కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వారే వ్యవసాయ పొలంలో వదిలేసిన అమానవీయ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో చోటుచేసుకుంది.



15 రోజులకు ఒకరు చొప్పున తల్లిని చూసుకుంటున్నారు:
వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన లచ్చమ్మకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె భర్త, పెద్దకుమారుడు మరణించారు. కొన్ని రోజుల క్రితం లచ్చమ్మకు కాలు విరగడంతో స్టాండ్ సాయంతో నడుస్తోంది. ప్రస్తుతం తన పనులే తాను చేసుకోలేని స్థితిలో ఉంది. 15 రోజులకు ఒకరు చొప్పున ముగ్గురు కుమారులు తల్లి బాధ్యతను చూస్తున్నారు.

కరోనా సోకడంతో తల్లిని పొలంలో వదిలేశారు:
అందులో ఒక కుమారుడి కుటుంబం కరోనా బారిన పడటంతో లచ్చమ్మకూ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. కరోనా కారణంగా తల్లి బాధ్యత చూసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తమ వ్యవసాయం పొలం దగ్గర ప్లాస్టిక్‌ కవర్‌తో చిన్నపాటి గుడారాన్ని ఏర్పాటు చేసి ఆమెను అక్కడ వదిలేశారు. నీరు, ఆహారం, మందులు ఆమె దగ్గర ఉంచారు.



కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు:
ఈ ఘటన స్థానికులను కదిలించింది. అయ్యో పాపం అని వారు వాపోయారు. కొడుకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు పొలం వద్దకు చేరుకుని కుమారులను పిలిపించారు. తల్లిని ఇంటికి తీసుకెళ్లమని వారితో చెప్పారు. అందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో ఆమెకు తోడుగా అక్కడే ఉండాలని పోలీసులు చెప్పడంతో వారు కూడా రాత్రి అక్కడే బస చేశారు.

కన్నతల్లిని తిరిగి ఇంటికి తీసుకెళ్లిన కొడుకులు:
పోలీసులు, గ్రామపెద్దలు కుమారులను పిలిపించి మరోమారు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. చివరకు తల్లిని తీసుకొచ్చేందుకు అంగీకరించి పీపీఈ కిట్‌ ధరించి పొలం నుంచి ఇంటికి తీసుకెళ్లారు. తల్లికోసం ఓ కుమారుడు గదిని ఏర్పాటు చేయగా.. చిన్నకుమారుడు ఆమెకు సపర్యలు చేసేందుకు అంగీకరించాడు.



కరోనా ప్రాణాంతకమే కానీ మెరుగైన వైద్యం తీసుకుంటే కోలుకోవడం కష్టమేమీ కాదు. ఎందరో వృద్ధులు కరోనా నుంచి కోలుకున్నారు. మనోధైర్యమే మందు అని వైద్య నిపుణులు సైతం చెబుతున్నారు. కరోనా రోగుల పట్ల వివక్ష చూపొద్దని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నాయి. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. కరోనా భయం మనుషుల్లో మానవత్వాన్ని చంపుతోంది. మనిషిని హృదయం లేని బండరాయిగా మారుస్తోంది.