Sathwik Case : శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ సూసైడ్‌తో కదిలిన విద్యాశాఖ

శ్రీ చైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటనతో తెలంగాణ విద్యాశాఖ కదిలింది. సోమవారం 14 ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ కాబోతున్నారు.

Sathwik Case : శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ సూసైడ్‌తో కదిలిన విద్యాశాఖ

Sathwik Case : నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటనతో తెలంగాణ విద్యాశాఖ కదిలింది. సోమవారం 14 ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ కాబోతున్నారు. సాయంత్రం 4గంటలకు MCRHDలో ఇంటర్ కాలేజీల మేనేజ్ మెంట్లతో సమావేశం కానున్నారు.

ఇంటర్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కాలేజీ యాజమాన్యాలతో డిస్కస్ చేయాలని నిర్ణయించింది. పిల్లలపై ఒత్తిడి తగ్గించేలా కాలేజీ యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పే అవకాశం ఉంది. కాలేజీల్లో మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా తీసుకోవాల్సిన చర్యలపైనా ఈ సమావేశంలో మంత్రి చర్చించనున్నారు. రేపు సమావేశానికి వచ్చే కాలేజీల్లో హైదరాబాద్ బేస్డ్ కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి.

Also Read..Satvik Case Report : శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ సూసైడ్.. ప్రభుత్వానికి ప్రాథమిక రిపోర్టు అందజేసిన ఎంక్వైరీ కమిటీ

నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న సాత్విక్‌ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. క్లాస్‌ రూమ్‌లోనే ఉరేసుకుని సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్‌ మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.

కాలేజీ యాజమాన్యం చదువుల ఒత్తిడి తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సాత్విక్ సూసైడ్ నోట్ లో రాశాడు. నలుగురు టీచర్లు తనను టార్చర్ పెట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని వారి పేర్లను నోట్ లో పేర్కొన్నాడు. తోటి విద్యార్థులు సైతం కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వల్లే సాత్విక్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా చెబుతున్నారు. సాత్విక్ తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read..Satvik Case : సాత్విక్ సూసైడ్ లెటర్ లో పలు కీలక అంశాలు.. వీరి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆవేదన

ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం.. సమగ్ర విచారణకు ఆదేశించింది. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యపై ఆరా తీసిన మంత్రి సబిత.. విద్యార్థి ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవాలని, పోలీసులు తమ దర్యాప్తును కొనసాగించాలని స్పష్టం చేశారు.

కాలేజీ హాస్టల్‌ నుంచి సాత్విక్‌ సామగ్రిని తీసుకుంటున్న సమయంలో అతడి దుస్తుల మధ్య సూసైడ్‌ నోట్‌ బయటపడింది. అందులో ప్రిన్సిపాల్‌ కృష్ణారెడ్డి, అడ్మిన్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య, శోభన్, క్యాంపస్‌ ఇన్‌చార్జి నరేశ్‌ల వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సాత్విక్‌ రాశాడు. తనతోపాటు తన మిత్రులకూ వారు నరకం చూపిస్తున్నారని, వారిపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకోవాలని కోరాడు.

‘‘అమ్మ, నాన్న, అన్న.. ఈ పని చేస్తున్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. కాలేజీలో పెట్టే మెంటల్‌ టార్చర్, వాళ్లు చూపే నరకాన్ని భరించలేకనే ఈ చెడ్డ పని చేస్తున్నా. మిస్‌ యూ. మీ అందరినీ బాధపెడుతున్నందుకు సారీ.. నన్ను క్షమించండి, నా కోసం మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అమ్మా, నాన్నకు నేను లేని లోటు రాకుండా చూసుకో అన్నా..’’అని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు సాత్విక్. ఆ లేఖ బాగా నలిగిపోయి ఉంది. దాంతో, కొన్ని రోజుల క్రితమే సాత్విక్ ఆ లేఖ రాసి పెట్టుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు.

విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. చదువుల ఒత్తిళ్లు విద్యార్థుల చావులకు కారణమవుతున్నాయి. మానసిక ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సాత్విక్ ఘటన మరువక ముందే అనూష ఘటన వెలుగుచూసింది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. పిల్లలు ప్రయోజకులవుతారని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు చదివిస్తుంటే.. పిల్లలు తీసుకునే కఠిన నిర్ణయాలు మాత్రం కన్నవారికి కడుపు కోతలే మిగులుస్తున్నాయి.