Gorati Venkanna : ‘గల్లీ సిన్నది, గోరటి కథ పెద్దది’..! స్టేజీపై ఎగిరి గంతేసి పాడే వాగ్గేయ నటరాజు మన ఎంకన్న

గోరటి పాట విన్న ఏ మనసైనా.. ఇప్పటివరకు "ఎంకన్నా.. నీ పాట సూపరన్నా" అనేది. ఇకనుంచి..

Gorati Venkanna : ‘గల్లీ సిన్నది, గోరటి కథ పెద్దది’..! స్టేజీపై ఎగిరి గంతేసి పాడే వాగ్గేయ నటరాజు మన ఎంకన్న

Gorati Venkanna Cover Photo

Gorati Venkanna : “గల్లీ సిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది.. వాళ్లున్న ఇండ్లు కిళ్లీ కొట్ల కన్నా సిన్నగున్నవి.. గల్లీ సిన్నది” ఈ పాట వినిపిస్తే చాలు గుర్తుకొచ్చే పేరే గోరటి వెంకన్న. పేదోడి బతుకు.. సామాన్యుడి జీవితం.. ప్రకృతితో మమేకమైన జీవనం.. మట్టి పదాలు.. మనుషుల స్వభావాలు.. ఇవే ఆయన కవితా వస్తువులు.

జీరగొంతుతోనే సింగర్ గా పాపులర్

పాట రాయడం గొప్ప. పాట పాడటం గొప్ప. పాట రాసి పాడటం కూడా గొప్పే. కానీ.. పాట రాసి.. పాడి.. తన జీర గొంతులో ప్రాణం పోసి.. ఎగిరి గంతేసి ఉత్సాహం నింపి.. జనంలోకి తీసుకెళ్లడం మామూలు గొప్ప కాదు. అనితర సాధ్యమైన కళ.

మాటల తోనే పాట పుట్టిస్తాడు.. మాట్లాడుతుంటే పాటందుకుంటాడు.. పాటతోనే పాటే పదం కలిపేలా చేస్తాడు ఆయనే గోరటి వెంకన్న. స్టేజీపై ఎగిరి గంతేసి పాడటం ఆయన స్టైల్. ఆ ‘జనం పాట’ వినేవాళ్లలో కూడా అదే జోరు కనిపించడం కామన్.

1963 ఏప్రిల్ 4 పుట్టారు గోరటి వెంకన్న. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా గౌరారం ఆయన సొంత ఊరు. బానిస బతుకుల్లో చైతన్యం నింపి.. స్వేచ్ఛ కాంక్ష రగిలించిన కమ్యూనిస్టు మేధావుల ప్రసంగాలు, చైతన్య గీతికలంటే ఆయనకు మక్కువ. అలా జానపదాలు రాశారు. రైతులు, వారి జీవితాలపై వచన కవితలు రాసి పాడుతూనే పెరిగారు. బతుకమ్మ పండుగ సంబురాలపై గీతాలను కైగట్టి ఆలపించారు. అలా తెలంగాణ ప్రాంతంలోనే ప్రముఖ జానపద వాగ్గేయ కారుడిగా పేరు తెచ్చుకున్నారు.

‘పల్లె కన్నీరు’ పాట సూపర్ హిట్

శ్రీహరి కుబుసం సినిమాలో ‘పల్లె కన్నీరు పెడుతుందో..’ అనే పాట గోరటి వెంకన్న రాసిందే. ఆయన రచన శైలి ఎంత డెప్త్ గా.. ఎంత అలవోకగా ఉంటుందనేదానికి ఈ ఒక్క పాటే ఉదాహరణ. సబ్జెక్టు ఉండేలా వచన కవిత్వాన్ని ఈజీగా పేపర్ పై పెట్టడంలో గోరటి దిట్ట. రేలా పూతలు, అల సంద్రవంక, పూసిన పున్నం, వల్లంకి తాళం, ఏకు నాదం మోత లాంటి కవితా సంపుటిలను, వచన కవితా పుస్తకాలను రిలీజ్ చేశారు గోరటి వెంకన్న.

సినిమాల్లో పాటల రచయిత
ఎన్ కౌంటర్, శ్రీరాములయ్య, కుబుసం, వేగు చుక్కలు, మహా యజ్ఞం, మైసమ్మ ఐపీఎస్, బతుకమ్మ, నగరం నిద్రపోతున్న వేళ, పీపుల్స్ వార్, బందూక్, బస్తీ, బిలాపూర్ పోలీస్ స్టేషన్, అన్నదాత సుఖీభవ, మల్లేశం, దొరసాని, షీష్ మహల్ సినిమాల్లో దర్శక, నిర్మాతల అభిరుచి మేరకు పాటలు అందించారు గోరటి వెంకన్న. రాశి కన్నా వాసి ముఖ్యం అన్నట్టు తక్కువ పాటలే రాసినా అన్నీ పాపులర్ అయ్యాయి. తెలంగాణ పల్లె పాటలతో శాటిలైట్ టీవీ ఛానెళ్లలో వచ్చిన ప్రోగ్రాములతో గోరటి వెంకన్న మరింత పాపులర్ అయ్యారు.

ప్రత్యేక రాష్ట్రంలో కీర్తికిరీటాలు
ఏపీ ప్రభుత్వం గోరటి వెంకన్నను 2006లో కళా రత్న, హంస అవార్డులతో గౌరవించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో గోరటి ఖ్యాతి మరింత పెరిగింది. ఆయనకు 2016లో కేసీఆర్ ప్రభుత్వం కాళోజీ నారాయణ రావు పురస్కారంతో సత్కరించింది. కేసీఆర్ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత.. 2020 నవంబర్ లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గోరటి వెంకన్నకు సమున్నత గౌరవం లభించింది. 2021 డిసెంబర్ 30నాడు.. ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వరించింది. దీంతో.. తెలంగాణ మట్టి మనిషి గోరటి ఖ్యాతి ప్రపంచ నలుమూలలకు చేరింది. గోరటి పాట విన్న ఏ మనసైనా.. ఇప్పటివరకు “ఎంకన్నా.. నీ పాట సూపరన్నా” అనేది. ఇకనుంచి “ఎంకన్నా.. నువ్ గ్రేటన్నా”అనక మానదు.