జీహెచ్ఎంసీ మేయర్ పీఠం దక్కేదెవరికో?

జీహెచ్ఎంసీ మేయర్ పీఠం దక్కేదెవరికో?

GHMC mayor : గ్రేటర్ మేయర్ అభ్యర్థి ఎవరన్న దానిపై గులాబీ పార్టీలో సస్పెన్స్‌ కొనసాగుతోంది. జనరల్ మహిళకు స్థానం రిజర్వు కావడంతో అదృష్టం వరించే ఆ మహిళామణి ఎవరన్న దానిపై చర్చ జోరుగా సాగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా రాకపోవడంతో.. గులాబీ పార్టీ వ్యూహం ఏంటి గ్రేటర్ హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 11న కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ అధికార పార్టీకి దక్కకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరించింది. టిఆర్‌ఎస్ 56 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందాయి. మేయర్ అభ్యర్థి ఎవరన్న దానిని సీల్డ్ కవర్లో వెల్లడిస్తామని.. సీఎం కేసీఆర్‌ ఇప్పటికే స్పష్టం చేశారు.

బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఈ పదవులకు పోటీ పడే అవకాశం దాదాపు లేదన్న అంచనాలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఉంది. అధికార పార్టీకి కార్పొరేటర్ల సంఖ్యతో పాటు.. ఎక్స్అఫిషియో ఓటర్ల సంఖ్య కూడా అత్యధికంగా ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ బల్దియాపై గులాబీ జెండా ఎగరవేయడం దాదాపు ఖాయమే అని విశ్లేషకులు అంటున్నారు. గురువారం జరిగే ఎన్నికల వ్యూహంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాదాపు కసరత్తు పూర్తి చేశారు.

మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఏకగ్రీవమైతే.. అధికార పార్టీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం లేదు. పోటీ అనివార్యమైతే ఎలా వ్యవహరించాలన్న అంశంపై కూడా ప్రణాళికలను అధికార పార్టీ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మేయర్ స్థానం కైవసం చేసుకునేందుకు విపక్ష పార్టీలకు అవసరమైన బలం లేకపోవడం కూడా తమకు కలిసి వస్తుందని గులాబీ నేతలంటున్నారు.

సంపూర్ణ బలం లేకపోయినా బీజేపీ మేయర్ స్థానానికి పోటీ చేస్తే.. ఎంఐఎం టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై అధికార పార్టీ నుంచి విజయం సాధించిన మహిళలు భారీగా ఆశలు పెంచుకున్నారు.

ఆశావహుల్లో భారతినగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి, బంజారా హిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మి, వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్‌ మన్నె కవితల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసి సీల్డ్‌ కవర్‌లో ఉంచారని.. పార్టీ సూచించిన అభ్యర్థినే బలపరచాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ కార్పొరేటర్లకు సూచించారు.