కొత్త టీం రెడీ చేసుకుంటున్న బండి సంజయ్.. పార్టీ విధానాల్లోనూ మార్పులు

తెలంగాణలో కమలం పార్టీ కొత్త బాస్‌గా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తి కాబోతోంది. నిజానికి ఆయన పదవిని చేపట్టిన తర్వాత తనకంటూ ఒక టీమ్‌ను సిద్ధం చేసుకుంటారని అనుకున్నారు. కానీ, అప్పుడు కుదరలేదు. ఇప్పుడు మాత్రం టీమ్ ఏర్పాటుపై దృష్టి పెట్టిన బండి సంజయ్.. ఆ దిశగా మార్పులు చేర్పులు చేయాలని డిసైడ్ అయ్యారట. అందుకు అనుగుణంగా పార్టీ పెద్దలతో పాటు సంఘ్ పరివారంతో చాలా సార్లు డిస్కస్ చేసేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
రాష్ట్ర పార్టీలో పలు కమిటీలు కీలకంగా వ్యవహరిస్తాయి. ఈసారి ఆయా కమిటీలను కూడా ప్రక్షాళన చేసేందుకు సంజయ్ రెడీ అవుతున్నట్లు సమాచారం. రాష్ట్ర కోర్ కమిటీలో ప్రస్తుతం 28 మంది సభ్యులున్నారు. ఆ నెంబర్‌ను 20 మందికి తగ్గించేయాలని డిసైడ్ అయ్యారని పార్టీలో అనుకుంటున్నారు. ఉపాధ్యక్షులను 10 నుంచి ఏడుగురికి, కార్యదర్శలను పది నుంచి ఐదుగురికి కుదించేస్తారట.
జనరల్ సెక్రటరీ పోస్టులు కూడా ఐదుగురికే పరిమితం చేస్తారని అంటున్నారు. వీటితో పాటు అధికార ప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, పార్టీకి అనుబంధంగా ఉండే విభాగాలు.. ఎన్నారై, ఐటీ, పొగ్రామ్స్ సెల్ వంటి 30 విభాగాలకు సంబంధించి కొత్త వారిని నియమించాలని సంజయ్ ఫిక్స్ అయిపోయారు.
పార్టీకి అనుబంధంగా పని చేసే యువ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, కిసాన్ మోర్చా, మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా, మైనార్టీ మోర్చాలకు కొత్త ముఖాలను ఎంపిక చేశారట. వీటన్నింటికి కూడా పాత నేతలతో పాటు పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చేశారని పార్టీలో చెబుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ప్రస్తుతం కరోనా జోరు ఎక్కువగా ఉండడంతో వారం తొందర్లోనే పూర్తి చేసేస్తారా… లేకపోతే కొన్నాళ్లు ఆగుతారా అనే ప్రశ్న కార్యకర్తల మదిలో మెదులుతున్న ప్రశ్న.