హైదరాబాద్ కు ఎంఐఎం, టీఆర్ఎస్ నుంచి విముక్తి కల్పిస్తాం : బండి సంజయ్

హైదరాబాద్ కు ఎంఐఎం, టీఆర్ఎస్ నుంచి విముక్తి కల్పిస్తాం : బండి సంజయ్

Bandi Sanjay criticizes MIM and TRS : హైదరాబాద్ కు ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీల నుంచి విముక్తి కల్పిస్తామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ వల్ల హైదరాబాద్ అభివృద్ధికి దూరమైందని విమర్శించారు. శుక్రవారం (డిసెంబర్ 18, 2020) హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని బండి సంజయ్, బీజేపీ కార్పొరేటర్లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ఎంఐఎం, టీఆర్ఎస్ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు.

పాతబస్తీలో అభివృద్ధిపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఓవైసీ వల్లే ఓల్డ్ సిటీ అభివృద్ధి చెందడం లేదని విమర్శించారు. ఓల్డ్ సిటీకి మెట్రోరైలు ఎందుకు వద్దంటున్నారో స్పష్టం చేయాలన్నారు. ఎంఐఎం, టీఆర్ఎస్ చేస్తున్న విధ్వంసాన్ని కడిగేస్తామని చెప్పారు. మేయర్ కాకపోవచ్చు…కానీ ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. బీజేపీతోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావించారని పేర్కొన్నారు.

తాము ఏ పార్టీ, ఏ మతం, వర్గానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పని చేసినా, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేసినా సహించబోమన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి దయతో జీహెచ్ఎంసీలో ఎక్కువ సీట్లు దక్కించుకున్నామని తెలిపారు. ‘మా కార్పొరేటర్లలో ఒక్కరిని టచ్‌ చేస్తే.. మేము వంద మందిని టచ్‌ చేస్తాం’ అని హెచ్చరించారు.

అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

బండి సంజయ్, బీజేపీ కార్పొరేటర్లు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు సేవ చేస్తాం..క్రమ శిక్షణతో ముందుకెళ్తామని కార్పొరేటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. సంజయ్ జీహెచ్ఎంసీ ఎన్నికల మొక్కు తీర్చుకున్నారు. శుక్రవారం మక్కా మసీదు ప్రార్థనలు కావడంతో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.