తెలంగాణ బడ్జెట్ లెక్కలు : తగ్గిన ఆదాయం, ఆర్టీసీ, లిక్కర్ రేట్లు పెంచుతారా ?

తెలంగాణ బడ్జెట్ లెక్కలు : తగ్గిన ఆదాయం, ఆర్టీసీ, లిక్కర్ రేట్లు పెంచుతారా ?

Telangana budget : తెలంగాణ బడ్జెట్‌ రూపకల్పనపై సుదీర్ఘ కసరత్తు చేశారు సీఎం కేసీఆర్‌. కేంద్ర బడ్జెట్‌ ద్వారా రాష్ట్రానికి సమకూరే నిధులు, 15వ ఆర్థిక సంఘం సిఫారసులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. ఈ సమావేశంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలకు ఎక్కడా లోటు రాకుండా… ప్రధాన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించేలాగా బడ్జెట్ పద్దులు ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.

పన్నుల్లో వాటా, స్థానిక సంస్థలకు ఇచ్చేవి మాత్రమే నికరంగా అందనున్నాయని అధికారులు సీఎం కేసీఆర్‌కు తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా తగ్గడం, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి 1 శాతం పెరగడం సహా అన్ని అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. 15వ ఆర్థికసంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అంశాలను నివేదించినా మిషన్‌ భగీరథకు మినహా ఎలాంటి సిఫారసులు చేయలేదని వివరించారు. కరోనాతో రాష్ట్రానికి ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, రెండు నెలలుగా రాబడులు పెరిగినా ఈ ఆర్థికసంవత్సరం ముగిసేలోగా అంచనాలు అందుకోవడం అసాధ్యమని వాస్తవ పరిస్థితిని వివరించారు. కోవిడ్‌తో 50 వేల కోట్ల రూపాయల మేర రాబడి అంచనాలు తగ్గొచ్చని గతంలోనే చెప్పిన అధికారులు..రానున్న నెలల్లో ఎంతవరకు రాబడులు ఉంటాయో చూచాయిగా చెప్పారు.

ప్రభుత్వ ప్రాధాన్య సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి, వచ్చే ఆర్థికసంవత్సరంలో ఎంతెంత ఖర్చు చేయాల్సి ఉంటుందో ఆరా తీశారు. ఈ సందర్భంగా అవనసర వ్యయాలు తగ్గించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు వెచ్చించడంలో ఇక్కట్లు లేకుండా చూడాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. మొత్తంగా సుమారు 20 వేల కోట్ల మేరకు తెలంగాణ రాష్ట్ర ఆదాయానికి గండి పడటంతో పెండింగ్ బకాయిలు పేరుకుపోయాయని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో 2021-22 వార్షిక బడ్జెట్ ద్వారా ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్థిక లోటు లేకుండా బడ్జెట్ పద్దులను రూపొందించాలని దిశానిర్దేశం చేయడంతో.. ఆర్టీసీ, భూ రిజిస్ట్రేషన్, విద్యుత్‌ యూనిట్ ఛార్జిలతో పాటు లిక్కర్ రేట్లను పెంచే ప్రతిపాదన చేశారు అధికారులు. సొంత రాబడులే కీలకం కావడంతో జీఎస్టీ, అమ్మకం పన్నుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీఎస్‌ చెప్పుకొచ్చినట్లు తెలిసింది.