Telangana Cabinet : తెలంగాణ కేబినెట్.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతులకు తీపి కబురు అందించింది. రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం ఆర్థికశాఖను ఆదేశించింది.

Telangana Cabinet : తెలంగాణ కేబినెట్.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

Telangana Cabinet

Telangana cabinet : తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతులకు తీపి కబురు అందించింది. రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేయాలని మంత్రివర్గం ఆర్థికశాఖను ఆదేశించింది. రుణమాఫీ అమలుపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఇప్పటివరకు జరిగిన రుణమాఫీ వివరాలను ఆర్థికశాఖ మంత్రివర్గానికి వివరించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా తీవ్ర ప్రభావం చూసిందన్న ఆర్థిక శాఖ ఆ ఎఫెక్ట్ తో రెండేళ్లుగా రూ.25 వేల వరకు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేసినట్లుగా వివరించింది. ఈనెల 15 నుంచి రూ.50 వేల లోపు రైతు రుణాలు మాఫీ చేయాలని కేబినెట్ ఆదేశించింది.

వృద్ధాప్య ఫించన్ అర్హతను 57 ఏళ్లకు తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తక్షణమే అమలు ప్రక్రియను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయంతో మరో 6.62 లక్షల కొత్త ఫించన్లు పెరుగనున్నాయి. తెలంగాణలో ఫించన్ల సంఖ్య మొత్తం 58 లక్షలకు చేరుకోనుంది. కుటుంబంలో ఒక్కరికే పింఛన్ పద్ధతి కొనసాగనుంది. భర్త చనిపోతే భార్యకు…భార్య చనిపోతే భర్తకు వెంటనే పింఛన్ బదిలీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

అనాథశరణాలయాల స్థితిగతుల కోసం సత్యవతి రాథోడ్ అధ్యక్షతన సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా మంత్రలు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాథల వివరాలు అందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను కేబినెట్ ఆదేశించింది.

రాష్ట్రంలో కరోనా పరిస్థతి, వ్యాక్సినేషన్ పై చర్చించారు. కొన్ని జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంపై ఏం చేయాలన్నది దానిపై చర్చించారు. అన్ని జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించి వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. అన్ని రకాల మందులు ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు.

కొత్తగా మంజూరైన 7 మెడికల్ కాలేజీల ప్రారంభానికి కావాల్సిన నిర్మాణాలను చేపట్టాలని, సత్వరమే వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది. భవిష్యత్ లో అనుమతించబోయే మెడికల్ కాలేజీల కోసం స్థలాన్వేషణ, సౌకర్యాల కల్పనకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించింది. ధోబీ ఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత కరెంట్ నిర్ణయాన్ని వారంలోగా అమలు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దళిత బంధు విధి విధానాలు, దళిత బంధు అమలుకు ప్రత్యేక యంత్రాంగం కోసం అమలు కోసం మంత్రివర్గం సమాలోచనలు చేసింది. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలిచిన పీవీ సింధును తెలంగాణ కేబినెట్ అభినందించింది.

నూతన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులపై కేబినెట్ లో చర్చించారు. త్వరలో 5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ఆదేశించింది. వరంగల్, చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణం, టిమ్స్, ఎల్బీ నగర్ గడ్డి అన్నారం, అల్వాల్ లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది.

పటాన్ చెరులో కొత్తగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేసింది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు టిమ్స్ గా నామకరణం చేశారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఒకచోట అందించే సమీకృత కలేజీలుగా తీర్చిదిద్దాలని కేబినెట్ ఆదేశించింది. సత్వరమే వైద్య సేవలను ప్రారంభించాలని తెలిపింది. నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డిని నియమించాలని నిర్ణయించారు. గవర్నర్ ఆమోదం కోసం కేబినెట్ సిఫారసు చేసింది.