Telangana Cabinet: తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్‌లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Telangana Cabinet: తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం

Telangana

Telangana Cabinet meeting: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్‌లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం జరిగింది. దాదాపు ఏడు గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సంధర్భంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి విపరీతంగా పెరుగనున్న నేపథ్యంలో.. ధాన్యం నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్ సహా నూతన పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని రాష్ట్రమంత్రి మండలి ఏర్పాటు చేసింది.

ఈ సబ్ కమిటీలో సభ్యులుగా, మంత్రి గంగుల కమలాకర్, హరీశ్ రావు, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి ఉంటారు. ఈమేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.

‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం:
‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 500 ఎకరాలకు తగ్గకుండా 1000 ఎకరాల వరకు తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు చేసి 2024 -25 సంవత్సరం వరకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాలల్లో ఏర్పాటు లక్ష్యంగా చర్యలు చేపట్టాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మార్గదర్శకాల ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

ప్రభుత్వం భూమిని సేకరించి ఏర్పాటు చేసిన జోన్లలో అన్నీ మౌలిక వసతులను ప్రభుత్వమే అభివృద్ది చేసి దరఖాస్తు చేసుకున్నవారికి అర్హతమేరకు అందులో భూమిని కేటాయించాలని, తద్వారా సుమారు 25 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించి, 70వేల మందికి ప్రత్యక్ష ఉపాధి 3 లక్షల మందికి పరోక్ష ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది. విదేశాలకు ఎగుమతి చేసే నాణ్యతతో కూడిన స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందించాలని, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ‘ప్లగ్ అండ్ ప్లే’ పద్దతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించింది.

వ్యవసాయ రంగంలో సాంకేతికతను మరియు నైపుణ్యాన్ని పెంచే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ విధానాన్ని అమలు పరచాలని అధికారులను అదేశించింది. రైస్ మిల్లులు, బియ్యం ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు , పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం, చేపలు, కోల్లు, పాలు మరియు డైరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను ఈ విధానం ద్వారా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల చుట్టూ కనీసం 500 మీటర్ల వరకు బఫర్ జోన్ గా గుర్తించి ఎలాంటి జనావాసాలకు, నిర్మాణాలను అనుమతించకూడదని స్పష్టం చేసింది.

ఆసక్తి కలిగిన వ్యాపారవేత్తలు ఎంటర్ ప్రెన్యూర్స్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్థుతం జూలై 12 వరకు వున్న ఆఖరు తేదీని జూలై 31 వరకు పొడిగించాలని కేబినెట్ నిర్ణయించింది.

పాలసీలో భాగంగా రూపొందించిన మార్గదర్శకాలపై చర్చించిన కేబినెట్:
రాష్ట్ర నీటిపారుదల సామర్థ్యంలో గణనీయమైన పెరుగుదల కారణంగా వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్థక, పాడి మరియు మత్స్య రంగాలలో సాధించే అదనపు ఉత్పత్తిని ప్రాసెసింగ్ చేసేందుకు రాష్ట్రంలో అనువైన సామర్థ్యం సృష్టించబడిందని కేబినెట్ నిర్ధారించింది.

ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల స్థాపన ద్వారా, వాల్యూ చైన్ ముందుకు సాగడానికి, ఉత్పత్తిదారులకు, రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్ధిక ప్రోత్సహకాలు కల్పించాలని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా, గ్రామీణ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.

ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల అభివృద్ధితో ఆర్థిక కలాపాలు పెరిగి, తద్వారా ఉపాధి పెరిగి, రాష్ట్రంలోని గ్రామీణ మారుమూల వెనకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్దికి దారి తీస్తుందని కేబినెట్ ఆశాభావం వ్యక్తం చేసింది. గ్రామీణ ఎస్సీ ఎస్టీ మహిళలకు జోన్లల్లో వ్యవస్థాపక అవకాశాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని నిర్ణయం చేసింది.