GO No: 111 in Hyderabad: జీవో నెంబర్ 111 ఎత్తివేతకు తెలంగాణ కేబినేట్ ఆమోదం: మరి జంట జలాశయాల మాటేమిటి?

ఎంతో కాలంగా 111 జీవో పరిధిలోని ప్రాంతాల ప్రజలు చేస్తున్న విన్నపాన్ని సానుభూతితో అర్థం చేసుకున్న కేబినేట్..111 జీవోను రద్దు చేయాలని నిర్ణయించింది.

GO No: 111 in Hyderabad: జీవో నెంబర్ 111 ఎత్తివేతకు తెలంగాణ కేబినేట్ ఆమోదం: మరి జంట జలాశయాల మాటేమిటి?

Go

GO No: 111 in Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మీడియా సమావేశంలో పలు కీలక విషయాలు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు, యూనివర్సిటీలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సహా హైదరాబాద్ మహానగర పరిధిలో జీఓ నెంబర్ 111 ఎత్తివేతపై సీఎం కేసీఆర్ ప్రకటనలు చేశారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోనూ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 111 జీవో ఉన్న కారణంగా అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతున్నదని అభిప్రాయ పడ్డ కేబినెట్ ఆమేరకు జీఓ నెంబర్ 111ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు, గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఆ జలాశయాల క్యాచ్ మెంట్ ఏరియాలో నిర్మాణాలు చేయకూడదని గతంలో 111 జీవో అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం నగర త్రాగునీటి అవసరాలు గండిపేట, హిమాయత్ సాగర్ పై ఆధారపడి లేవు. కృష్ణా, గోదావరి జలాల ద్వారా నగర ప్రజల త్రాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ఈ నేపథ్యంలో 111 జీవో ఉద్దేశ్యం సంబద్ధతను కోల్పోయింది.

Also read:CM KCR: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం: రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందన్న సీఎం కేసీఆర్

ఎంతో కాలంగా 111 జీవో పరిధిలోని ప్రాంతాల ప్రజలు చేస్తున్న విన్నపాన్ని సానుభూతితో అర్థం చేసుకున్న కేబినేట్..111 జీవోను రద్దు చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల పరిరక్షణ విషయంలోనూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని కేబినేట్ నిర్ణయించింది. ఈ రెండు జలాశయాలను కాళేశ్వరం జలాలతో అనుసంధానం చేసే పనులు కొనసాగుతున్నాయి. ఈ జలాశయాల ద్వారా త్రాగునీటి సరఫరా కోసం ఏర్పడి ఉన్న ప్రస్తుత వ్యవస్థను నగరంలో పచ్చదనం పెంపొందింపజేసే నీటి సరఫరాకు ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మూసీ సుందరీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ జలాశయాల ద్వారా నీటిని మూసీలోకి వదలడానికి తగిన పథకం గతంలోనే రూపొందింది. మహానగర పరిధిలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ విధంగా ఈ రెండు జలాశయాలు ఉపయోగంలో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

Also read:Pawan Kalyan in Anantapur: రైతుల కన్నీళ్లు కష్టాలు తీర్చలేనప్పుడు ఈప్రభుత్వాలు ఎందుకు: పవన్ కళ్యాణ్

మూసీ సుందరీకరణతో నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని, నగర పర్యావరణం మెరుగుపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రెండు జలాశయాలు కాలుష్యం కాటుకు గురికాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మురుగునీటి పారుదల నిర్మాణాలను వెంటనే చేయాలని, ఇతర పథకాలను రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన, పురపాలక శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ భాగస్వామ్యంతో కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ ద్వారా రెండు జలాశయాల పరిరక్షణ కోసం నియమనిబంధనలను ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేయాలని కేబినేట్ నిర్ణయించింది. ఈ రెండు జలాశయాలలోనూ మూసీ, ఈసా నదులలోనూ కాలుష్య జలాలు చేరడానికి వీలు లేకుండా కొత్త జీవోను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆమోదం ద్వారా రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కమిటీని ఆదేశించారు. జీఓ నెంబర్ 111 ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో..వికారాబాద్, పరిగి, గండిపేట్ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు సైతం రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారనున్నాయి.

Also read:Ambati Rambabu : వైసీపీలో అసంతృప్తి టీ కప్పులో తుపాను-అంబటి రాంబాబు