Telangana Cabinet Meeting: ముగిసిన క్యాబినెట్ భేటీ.. రేపు మరోసారి!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ప్రగతి భవన్ లో జరిగిన సమావేశానికి రాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీ, భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపు, 57సంవత్సరాల వారికి పెన్షన్‌తో పాటు చేనేతలకు బీమా అంశాలతో పాటు వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చ జరిగింది.

Telangana Cabinet Meeting: ముగిసిన క్యాబినెట్ భేటీ.. రేపు మరోసారి!

Telangana Cabinet Meeting

Telangana Cabinet Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ప్రగతి భవన్ లో జరిగిన సమావేశానికి రాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీ, భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపు, 57సంవత్సరాల వారికి పెన్షన్‌తో పాటు చేనేతలకు బీమా అంశాలతో పాటు వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చ జరిగింది. మరోవైపు కృష్ణా జలాల వివాదంపై ఏ రకంగా ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది.

మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన ఈ సమావేశం.. దాదాపు ఎనిమిది గంటలపాటు జరిగింది. ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆదాయ మార్గాలు పెంచుకునే దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశంపై మంత్రులు, అధికారులు సూచనలు, సలహాలు వినిపించినట్లుగా తెలుస్తుంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై చర్చించిన సీఎం హైదరాబాద్‌ నగర శివారులోని మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య నివారణ కోసం అదనంగా రూ.1200 కోట్లు మంజూరు చేశారు. అందుకు సంబంధించిన అవకాశాలను, విధివిధాలాను అన్వేషించాలని మున్సిపల్‌ శాఖ అధికారులను కేబినెట్‌ ఆదేశించింది.

రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 50 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపగా.. కొత్త పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్‌ రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇకపై ఉద్యోగ నియామకాలకు ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకోగా.. ఇకపై లోకల్ కేటగిరీలో 50శాతం సీట్లు కేటాయించనున్నారు. కొత్త జిల్లాల వారీగా పోస్టులు, అధికారుల కేటాయింపు జరగాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది.

ఇక కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా ఖాళీల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపు కొరకు బుధవారం కూడా కేబినెట్ భేటీ కానుంది. ఇక రేపటి భేటీకి పూర్తి వివరాలతో అన్నిశాఖల కార్యదర్శులు హాజరవ్వాలని కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల వారీగా పోస్టులు, అధికారుల కేటాయింపు సత్వరమే చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. కరోనా కట్టడికి నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలని.. ఇందుకు సంబంధించిన నివేదిక రూపొందించాలని వైద్య అధికారులను సీఎం కేసీఆర్ కొద్దిరోజుల క్రితం ఆదేశించిన సంగతి తెలిసిందే కాగా.. ఆ నివేదికతో పాటు మరోవైపు కరోనా థర్డ్ వేవ్ రావడానికి ముందుగానే రాష్ట్రంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్ వేయాలనే ప్రతిపాదనపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తుంది.