Telangana cabinet: నేడే తెలంగాణ కేబినెట్.. లాక్‌డౌన్‌ పొడిగిస్తారా?

తెలంగాణ కేబినెట్ నేడు(08 జూన్ 2021) భేటీ కానుంది. మంత్రి వర్గ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్ రేపటితో ముగుస్తుండగా.. లాక్‌డౌన్ పొడిగిస్తారా లేక మరిన్ని సడలింపులు ఉంటాయా కేబినెట్‌లో మీటింగ్‌లో తేల్చనున్నారు.

Telangana cabinet: నేడే తెలంగాణ కేబినెట్.. లాక్‌డౌన్‌ పొడిగిస్తారా?

Telangana Cabinet

Telangana cabinet meeting: తెలంగాణ కేబినెట్ నేడు(08 జూన్ 2021) భేటీ కానుంది. మంత్రి వర్గ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారు? అనే విషయమై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్ రేపటితో ముగుస్తుండగా.. లాక్‌డౌన్ పొడిగిస్తారా? లేక సడలింపులు చేస్తారా? అనే విషయమై కేబినెట్‌లో క్లారిటీ రానుంది. మరోవైపు ఉద్యోగుల పీఆర్సీ, వానాకాలం సీజన్, ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలపై నిర్ణయం, థర్డ్‌వేవ్‌ను ఎదుర్కునే అంశాలుపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.

కరోనా సెకండ్‌వేవ్‌ కట్టడికి లాక్‌డౌన్ అమలులో ఉండగా.. రేపటితో లాక్‌డౌన్ గడువు ముగుస్తుంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో… అన్‌లాక్‌ దిశగా అడుగులు వేస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మధ్యాహ్నం ఒంటిగంట వరకు మినహాయింపు ఇచ్చిన సర్కార్.. లాక్‌డౌన్‌ కొనసాగించాలా.. లేక ఎత్తివేయాలా అనే అంశంపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అన్‌లాక్‌ చేసి, నైట్‌ కర్ఫ్యూ మాత్రం కొనసాగించే అవకాశం ఉంది.

కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తే సమర్థవంతంగా ఎదుర్కునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. చిన్నారులకు వైద్య చికిత్స అందించేందుకు ఏర్పాట్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, వైద్య నిపుణుల భర్తీ చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినెట్‌లో చర్చించనున్నారు. పంట పెట్టుబడి సాయం రైతుబంధును ఈ నెల 15 నుంచి అందించనుంది ప్రభుత్వం. కల్తీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత పై చర్చిస్తారు. మరోవైపు రాష్ట్రంలో 19 డయాగ్నోటిక్‌ సెంటర్ల ప్రారంభంపై కూడా కేబినెట్‌లో క్లారిటీ రానుంది.

ఏడేళ్ళుగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఆశ‌లు నెర‌వేర‌బోతున్నాయి. కేబినెట్ స‌మావేశంలో ఉద్యోగుల పీఆర్‌సీ ఫీట్ మెంట్‌కు గ్రీన్ సిగ్నల్ లభించ‌నుంది. దీంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల కల నెరవేరనుంది.

ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణపై కేబినెట్‌ చర్చించనుంది. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకోగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. వేసవి సెలవులు ముగియనుండటంతో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అడ్మీషన్స్, క్లాసులు, ఉపాధ్యాయుల విధులు తదితర అంశాలపై సైతం మంత్రివర్గం చర్చించనుంది.