6వ తేదీన తెలంగాణ కేబినెట్..అసెంబ్లీ సమావేశాలే ప్రధాన అజెండా

  • Published By: madhu ,Published On : September 3, 2020 / 06:47 AM IST
6వ తేదీన తెలంగాణ కేబినెట్..అసెంబ్లీ సమావేశాలే ప్రధాన అజెండా

ఈనెల 6న తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది. ఈ దఫా సభలో ఆమోదించే బిల్లులు, చర్చించాల్సిన అంశాలపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది. గతంలో తీసుకొచ్చిన పలు ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ఆమోదించనుంది. ఇక సభలో ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కేబినెట్‌ చర్చించనుంది.



వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు గడువు దగ్గర పడుతుండడంతో.. అధికార పార్టీ అసెంబ్లీ సమావేశాలపై దృష్టి సారించింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానాలపై కసరత్తు మొదలు పెట్టింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించే బిల్లులు, చర్చించాల్సిన అంశాల జాబితాను సిద్ధం చేస్తోంది. గతంలో తెచ్చిన పలు ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపుతో.. అందుకు సంబంధించిన ఓ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఆయుష్‌ డాక్టర్ల వయో పరిమితి పెంచుతూ ఆర్డినెన్స్‌ తీసుకురావడంతో దానికి అసెంబ్లీ ఆమోదం తెలుపనుంది. అంతకుముందుగానే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించాల్సిన బిల్లుపై సీఎం కేసీఆర్‌.. మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. 6వ తేదీ ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించే యోచనలో కేసీఆర్‌ ఉన్నారు.



కొత్త రెవెన్యూ చట్టంపై దాదాపు రెండేళ్లుగా ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో..ఈ దఫా అసెంబ్లీ సమాశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని ఆమోదించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ అంశంపై కేసీఆర్‌ అధికారులతో వరుసగా సమీక్షిస్తున్నారు. రెవెన్యూశాఖలో తేవాల్సిన మార్పులపై ఆయన కసరత్తు చేశారు. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే నాటికే.. చట్టం రూపొందించడం పూర్తయితే.. ఈ సమావేశాల్లోనే కొత్త చట్టం అమల్లోకి రానుంది. కేబినెట్‌ కూడా నూతన రెవెన్యూ చట్టంపై చర్చించనుంది.
https://10tv.in/actress-madhavi-latha-face-to-face-over-drugs-affair/
తెలంగాణ వ్యాప్తంగా మరికొన్ని కులాలను బీసీ జాబితాలో చేర్చేందుకు బీసీ కమిషన్ సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేసింది. మరో 17 కులాలను బీసీ కులాల జాబితాలో చేర్చేందుకు ఆదివారం జరిగే మంత్రిమండలి సమావేశం ఆమోదం తెలుపనుంది. గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు.



గ్రేటర్‌ హైదరాబాద్‌ అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంపై ఈ కేబినెట్‌లో చర్చించే అవకాశముంది. ఇక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు, లాజిస్టిక్‌ పార్కులకు సంబంధించి విధానపరమైన నిర్ణయాన్ని ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించే అవకాశం ఉంది.