Telangana : పార్టీనే నమ్ముకున్నందుకు కేసీఆర్ నన్ను నట్టేట ముంచారు అందుకే రాజీనామా చేశా : చకిలం అనిల్ కుమార్

తెలంగాణ ఉద్యమ నేత చకిలం అనిల్ కుమార్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీనే నమ్ముకున్నందుకు కేసీఆర్ నన్ను నట్టేట ముంచారని ఉద్యమం సమయంలోను..పార్టీ కోసం కష్టపడినవారికి సరైన గౌైరవం దక్కటంలేదని అందుకే రాజీనామా చేశానని తెలిపారు.

Telangana : పార్టీనే నమ్ముకున్నందుకు కేసీఆర్ నన్ను నట్టేట ముంచారు అందుకే రాజీనామా చేశా : చకిలం అనిల్ కుమార్

chakilam anil kumar resigns from brs

chakilam anil kumar resigns from brs : తెలంగాణ ఉద్యమ నేత చకిలం అనిల్ కుమార్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లెటర్ ని అధిష్టానానికి పంపించారు అనిల్ కుమార్. ఈ సందర్భంగా చకిలం అనిల్ కుమార్ తన ఆవేదనను వ్యక్తంచేస్తూ మాట్లాడారు.. పార్టీ ఆవిర్భావం నుంచి నమ్ముకుని ఉన్నందుకు కేసీఆర్ నట్టేట ముంచాడు అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు అనిల్ కుమార్.క్లిష్ట ఎటువంటి కష్ట పరిస్థితులు వచ్చినా ఓర్పుతో నేర్పుతో పార్టీ కోసం కష్టపడ్డారనని..నల్గొండ జిల్లాలో పార్టీని కాపాడినా నాకు తగిన ప్రాధాన్యత దక్కలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

2014 లో నల్గొండ అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్డిగా ప్రకటించి క్యాన్సల్ చేశారని..2018 లో టీడీపీ నుండి వచ్చిన కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపిస్తే ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని కానీ అటువంటిది జరగలేదన్నారు. తెలంగాణ ద్రోహులుగా ముద్రపడ్డ వాళ్లందరూ బీఆర్ఎస్ మంచి మంచి పదవుల్లో ఉన్నారని..పార్టీలో పెత్తనం చెలాయిస్తున్నారని కానీ ఉద్యమం కోసం కష్టపడినవారు మాత్రం ఎటువంటి ప్రాధాన్యత దక్కకుండా తనలాగా మిగిలిపోతున్నారు అంటూ వాపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యమకారులు ఎటు పోవాలి? అని ఆవేదనగా ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడి జైలు పాలైన వ్యక్తులకు దక్కాల్సిన గౌరవం దక్కటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవం దక్కని చోట ఉండటం వ్యర్థం అని భావిస్తున్నా..పార్టీ ఆవిర్భావం నుంచి నమ్ముకుని ఉన్నందుకు కేసీఆర్ నట్టేట ముంచాడు..అందుకే రాజీనామా చేశా..నా ముఖ్య అనుచరులతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపిన చకిలం అనిల్ కుమార్ అవసరమైతే నల్గొండ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

కాగా..నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మలి విడత తెలంగాణ ఉద్యమకారుడు చకిలం అనిల్‌కుమార్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించారు. ఎమ్మెల్సీ దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుండి జిల్లాలో,నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనే కాకుండా పార్టీ విస్తరణలో అనిల్ కుమార్ కీలక పాత్ర పోషించారు. 22 ఏళ్లుగా పార్టీలో పనిచేసిన అనిల్ కుమార్ ప్రతి ఎన్నికలలో కూడా నల్గొండ అసెంబ్లీ టికెట్‌ ఆశించి నిరాశ చెందారు. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపిస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌ కి పిలిపించుకొని హామీ ఇచ్చారు. కేసీఆర్ హామీతో చకిలం ఆ ఎన్నికల్లో కంచర్ల గెలుపు కోసం పనిచేశారు. అయినప్పటికీ ఎమ్మెల్సీ పదవి కోసం ఆయన చేసిన నిరీక్షణ ఫలించకపోవడం..కేసీఆర్ తనకిచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతో తీవ్ర నిరాశకు గురై ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు.

బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన అనిల్ కుమార్ భవిష్యత్తులో ఏ పార్టీలో చేరనున్నారన్నది నియోజకవర్గ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కానీ అవసరమైన స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని చకిలం ప్రకటించారు. కాగా బీఆర్ఎస్ నుంచి ఏ ఒక్కరు బయటకు వచ్చినా తమ పార్టీలో చేర్చుకోవటానికి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ సిద్ధంగా ఉన్నాయి. ఈక్రమంలో మరి బీఆర్ఎస్ భంగపడ్డ చకిలం అనిల్ కుమార్ ఏ గూటికి చేరతారో? ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో వేచి చూడాలి..