పెళ్లికూతురిగా ముస్తాబైన సీఎం కేసీఆర్ దత్తపుత్తిక

పెళ్లికూతురిగా ముస్తాబైన సీఎం కేసీఆర్ దత్తపుత్తిక

cm kcr adopted daughter pratyusha marriage : తెలంగాణ సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక పెళ్లికూతురిగా ముస్తాబైంది. రేపు రంగారెడ్డి జిల్లాలో ప్రత్యూష వివాహం జరగనుంది. ప్రత్యూష, చరణ్‌రెడ్డి పెళ్లికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. 2020, డిసెంబర్ 27వ తేదీ ఆదివారం జరగబోయే సంగీత్‌ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్‌ హాజరుకానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక ప్రత్యూష పెళ్లికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆదివారం ప్రధానం కార్యక్రమం జరగనుండగా… సోమవారం ప్రత్యూష వివాహం జరగబోతోంది. రంగారెడ్డి జిల్లా పాటిగడ్డ లూర్దుమాత ఆలయంలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు జరగబోయే పెళ్లి ఏర్పాట్లను స్త్రీ శిశు సంక్షేమ శాఖ దగ్గరుండి పర్యవేక్షిస్తోంది.

హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన ఉడుముల జైన్‌మేరీ, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌రెడ్డితో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపిస్తారు. ప్రత్యూషకు చరణ్‌రెడ్డితో అక్టోబర్‌లో నిశ్చితార్థం జరిగింది. ప్రత్యూష కుటుంబంతో తమకు చుట్టరికం కూడా ఉందని చరణ్‌రెడ్డి బంధువులు తెలిపారు. చరణ్‌రెడ్డి అమ్మమ్మ గ్రామం పాటిగడ్డ కావడంతో ఇక్కడ వివాహం చేస్తున్నారు.
ఆదివారం ఉదయం బేగంపేట ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ప్రాంగణంలో సంగీత్‌ నిర్వహిస్తారు. ప్రత్యూష ప్రధానం కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్‌తోపాటు ప్రభుత్వ అధికారులు హాజరవుతారని వరుడి తరఫున బంధువులు తెలిపారు. ప్రత్యూష పెళ్లికి రావాలని అధికారులు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. వధువు ప్రత్యూషకు నిమ్స్‌లో ఉద్యోగం ఇస్తామంటూ సీఎం హామీ ఇచ్చినట్టు శిశుసంక్షేమశాఖ అధికారులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లాలో ఐదేళ్ల కింద… కన్న తండ్రి, సవతి తల్లి హింసకు ప్రత్యూష గురయ్యింది. ఈ విషయం మీడియాలో రావడంతో సీఎం కేసీఆర్‌ చలించిపోయారు. ఆమెను దత్తత తీసుకొన్నారు. సీఎం ఆదేశాలతో ఆమె వసతి, విద్య, బాగోగులను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు చూసుకుంటున్నారు. ప్రత్యూష ఇటీవల నర్సింగ్‌ విద్య కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్స్‌గా పని చేస్తోంది.