ఉద్యోగులకు 30శాతం ఫిట్‌మెంట్‌.. రిటైర్మెంట్ వయస్సు పెంపు

ఉద్యోగులకు 30శాతం ఫిట్‌మెంట్‌.. రిటైర్మెంట్ వయస్సు పెంపు

Kcr Prc

ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఉద్యోగులకు 30శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ 31 నుంచి 30శాతం పీఆర్సీ అమలవుతుందని చెప్పారు. 9లక్షల 97వేల 797 మందికి వేతనాలు పెంచారు. ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ మరో బంపర్‌ ఆఫర్‌ కూడా ఇచ్చారు. ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచారు. ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే గ్రాడ్యుటీ 16 లక్షలకు పెంచారు.

అలాగే అర్హులైన ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్లు, బదిలీలు ఇస్తామని వెల్లడించారు. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులకు స్వరాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి ఇస్తామని అన్నారు. కేసీఆర్‌ ప్రకటనతో ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలు. ఉద్యోగుల బాధలు అర్ధం చేసుకున్న మంచి మనసున్న సీఎం అంటూ ప్రశంసిస్తున్నారు.

పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు చర్చించానన్న కేసీఆర్.. కరోనా, ఆర్థికమాంద్యం కారణంగా ప్రకటన ఆలస్యం అయ్యిందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, అన్ని విభాగాల ఉద్యోగులకు పీఆర్సీ వర్తిస్తుందన్నారు. మానవీయ కోణంలో వేతనాలు పెంచామని వెల్లడించారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ప్రతి ఐదేళ్ల ప్రకారం పీఆర్సీ పెంచామన్నారు. ఇప్పటివరకు 80 శాతం ఉద్యోగాల ప్రమోషన్ ప్రక్రియ పూర్తయిందన్నారు. వెంటనే అంతర్ జిల్లాల బదిలీలు ఉంటాయని చెప్పారు.

15 శాతం అదనపు పెన్షన్ ఇచ్చేందుకు పెన్షనర్ల వయోపరిమితిని 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు కుదిస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు. 33 శాతం వరకు ఫిట్‌మెంటుతో వేతనాలు పెంచాలని ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేసినప్పటికీ… కరోనా కారణంగా 30 శాతం ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. పీఆర్సీపై ఏర్పాటైన బిశ్వాల్ కమిటీ ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే చాలని సిఫార్సు చేసినప్పటికీ.. కేసీఆర్ మాత్రం 30 శాతం ప్రకటించారు.

అటు ఉద్యోగులు కూడా ఏపీలో 27 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు కాబట్టి.. తెలంగాణలో 29 శాతం వరకూ వస్తుందంటూ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ, వారి అంచనాలను మించేలా కేసీఆర్‌.. 30శాతం ఇచ్చి ఉద్యోగుల్లో ఉత్సాహం నింపారు. ప్రతి ఒక్క శాతం ఫిట్‌మెంట్‌కు ఏటా 300 కోట్ల రూపాయలు ఖజానాపై భారం పడుతుందనేది ఆర్థిక శాఖ అంచనా. ఈ లెక్కన 30 శాతం ఇస్తే 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెరుగుతుంది. ప్రస్తుత ఫిట్‌మెంట్‌తో ప్రతి ఏటా అదనంగా 9 వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.