CM KCR PRESSMEET LIVE: సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ లైవ్

తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం ఆయన ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. 

CM KCR PRESSMEET LIVE: సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ లైవ్
ad

తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం ఆయన ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.

నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: సీఎం కేసీఆర్

నీతి ఆయోగ్ నిరర్ధక సంస్థగా మారిపోయింది..

 

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

 • 06 Aug 2022 05:31 PM (IST)

  పాల మీద దిక్కుమాలిన జీఎస్టీ ఎత్తేయండి

  గాలికి తప్ప అన్నింటికీ పన్ను వేశారు. పాలు, చేనేత, బీడీ కార్మికులపై, శ్మశానాలపై కూడా జీఎస్టీ వేస్తున్నారు. పాల మీద దిక్కుమాలిన జీఎస్టీ ఎత్తేయాలి. కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోంది. రాష్ట్ర పీఎస్‌యూల అప్పుల్ని కూడా రాష్ట్ర అప్పుల కిందే లెక్కగడుతున్నారు. తెలంగాణకు రూ.25 వేల కోట్ల జీఎస్టీ కోత పెట్టారు. నీతి ఆయోగ్‌ ఎజెండాలో కో ఆపరేటివ్ ఫెడరలిజాన్ని కాకి ఎత్తుకుపోయింది. కొన్ని రకాల పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి. కానీ, సెస్ పేరుతో రాష్ట్రాల వాటా ఎగ్గొడుతున్నారు. గతంలో ప్లానింగ్ కమిషన్‌తో వాదించి పన్నులు తెచ్చుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు నీతి ఆయోగ్‌లో ఎవరు ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నారో కూడా తెలియదు.

 • 06 Aug 2022 05:25 PM (IST)

  తెలంగాణలో కొత్తగా పది లక్షల మందికి పెన్షన్లు

  తెలంగాణలో కొత్తగా పది లక్షల మందికి పెన్షన్లు ఇవ్వబోతున్నాం. మొత్తం 46 లక్షల మందికి బార్ కోడ్ ద్వారా పెన్షన్ కార్డులు జారీ చేస్తాం. అనాథ పిల్లల్ని స్టేట్ చిల్ట్రన్‌గా డిక్లేర్ చేయాలని ఆదేశించాం. అనాథల్ని చదివించి, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తాం. దేశంలో 80 కోట్ల ఎకరాల భూమి ఉంది. అందులో 40 కోట్ల ఎకరాలు నాణ్యమైన సాగు భూమి. ప్రతి ఎకరానికీ నీళ్లు ఇవ్వగలిగేంతటి నదులున్నాయి. కానీ, కందిపప్పు, పామాయిల్ కూడా దిగుమతి చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ బహుముఖ ప్రతిభకు ఇది నిదర్శనం. 2014-15 నాటికి దేశంలో రూ.2.63 లక్షల ఎన్‌పీఏలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్‌పీఏలు రూ.20.07 లక్షల కోట్లకు చేరాయి. మహత్తరమైన పరిపాలన అంటే ఎన్‌పీఏలు తగ్గాలి కదా? ఎందుకు పెరిగాయి. ఎన్డీయే హయాంలో ఎన్‪‌పీఏలు ఒక దందాగా మారింది. ఇది మీ అద్భుత పనితీరుకు నిదర్శనమా? లేక మీరు చేస్తున్న లక్ష కోట్ల కుంభకోణమా? కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పతంగుల మాంజా, పీపీఈ కిట్లు, రేజర్లు కూడా చైనా నుంచి రావడమేనా మేకిన్ ఇండియా?

 • 06 Aug 2022 05:12 PM (IST)

  మంత్రులే ఎన్‌కౌంటర్లు చేస్తామంటున్నారు

  రూపాయి విలువ పాతాళానికి పడిపోయింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు మంచివని నీతి ఆయోగ్ చెప్పింది. ఈ పథకాలకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. కానీ, కేంద్రం 24 పైసలు కూడా ఇవ్వలేదు. నేతి బీరకాయలో నేతి ఎంతో.. నీతి ఆయోగ్‌లో నీతి అంతే. తెలంగాణ అభివృద్ధికి బ్రేకులు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎఫ్ఆర్‌బీఎం పరిధిలో మార్పులతో రుణ సేకరణకు అడ్డంకులు. దేశంలో ఎయిర్ పోర్టులు, ఎల్ఐసీ వంటి సంస్థలు ప్రణాళికా సంఘం వల్లే వచ్చాయి. సహకార వ్యవస్థపోయి నియంతృత్వ వ్యవస్థ వచ్చింది. ముఖ్యమంత్రులే బుల్డోజింగ్ చేస్తామనే స్థాయికి వచ్చింది. కొందరు మంత్రులే ఎన్‌కౌంటర్లు చేస్తామని చెబుతున్నారు. అన్ని రంగాల్లో దేశం సర్వనాశనమైంది.

 • 06 Aug 2022 05:02 PM (IST)

  ప్రధానికి భజన మండలిగా మారిన నీతి ఆయోగ్

  నీతి ఆయోగ్‌లో రాష్ట్రాలకు పాత్రలేదు. ప్రధానికి భజన మండలిగా మారింది. ప్రణాళికా సంఘానికి ఏం చేయాలో.. ఏం చేయకూడదో నిర్దిష్టమైన వ్యవహారం ఉండేది. రాష్ట్రాల బడ్జెట్ రూపకల్పనలో కూడా సహకరించేది. నీతి ఆయోగ్ ఏడేళ్ల తర్వాత ఏం కనిపిస్తోంది? నీతి ఆయోగ్‌ పెద్ద జోక్‌గా మారిపోయింది. దేశంలో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. 13 నెలలపాటు రైతులు ఆందోళన చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రధాని క్షమాపణ చెప్పి చట్టాల్ని రద్దు చేశారు. ఢిల్లీలోనే మంచినీళ్లు ట్యాంకర్లతో సరఫరా చేయాల్సి వస్తోంది. చివరకు ఉపాధి హామీ కూలీలు కూడా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాల్సి వచ్చింది.

 • 06 Aug 2022 04:54 PM (IST)

  కేంద్రం నుంచి వచ్చింది రూ.5 వేల కోట్లే

  మా ప్రతిపాదనలపై నీతి ఆయోగ్‌లో కనీసం చర్చించలేదు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ లక్షా 90 వేల కోట్ల రూపాయలు పథకాల కోసం ఖర్చుపెట్టింది. కేంద్రం నుంచి వచ్చింది రూ.5 వేల కోట్లే. మేం పంపించిన ప్రతిపాదనల్ని బుట్టదాఖలు చేశారు. నీతి ఆయోగ్‌కు వ్యూహం లేదు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై ఒక్కసారైనా నీతి ఆయోగ్‌లో చర్చించారా? ఆర్మీలో పాలసీలు మారుస్తున్నట్లు నీతి ఆయోగ్‌లో చర్చించారా?

 • 06 Aug 2022 04:49 PM (IST)

  కేంద్రం తీరుకు నిరసనగానే నీతి ఆయోగ్ సమావేశం బహిష్కరణ

  నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ నిర్ణయంపై ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ రాశారు. ఉద్దేశపూర్వకంగానే వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. నీతి ఆయోగ్ సూచనల్ని కేంద్రం పట్టించుకోవడం లేదు.

 • 06 Aug 2022 04:40 PM (IST)

  ఇది సహకార వ్యవస్థా? దోపిడీ వ్యవస్థా?

  నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్‌కన్నా మెరుగ్గా పనిచేస్తుందనుకున్నాం. నీతి ఆయోగ్‌లో సీఎం స్థాయి వ్యక్తులకు కూడా టైమ్ లిమిట్ పెడుతున్నారు. ఇది సహకార వ్యవస్థా? దోపిడీ వ్యవస్థా?

 • 06 Aug 2022 04:35 PM (IST)

  నీతి ఆయోగ్ నిరర్ధక సంస్థగా మారిపోయింది : కేసీఆర్

  నీతి ఆయోగ్ నిరర్ధక సంస్థగా మారిపోయిందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో నానాటికి పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. ప్రధాని చెప్పేవాటికి భజన మండలిగా మారిందని విమర్శించారు.