CM KCR National Party : ఇండియా కాలింగ్.. కేసీఆర్ జాతీయ పార్టీకి కౌంట్ డౌన్ షురూ.. సీఎంగా కొనసాగుతూనే..

కేసీఆర్ జాతీయ పార్టీకి కౌంట్ డౌన్ షురూ అయ్యింది. హైదరాబాద్ వేదికగా జాతీయ పార్టీ ప్రకటనకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.

CM KCR National Party : ఇండియా కాలింగ్.. కేసీఆర్ జాతీయ పార్టీకి కౌంట్ డౌన్ షురూ.. సీఎంగా కొనసాగుతూనే..

K.Chandrashekar Rao wishes

CM KCR National Party : కేసీఆర్ జాతీయ పార్టీకి కౌంట్ డౌన్ షురూ అయ్యింది. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ను ఆహ్వానిస్తూ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తీర్మానం చేయనున్నారు. తీర్మానాన్ని కేసీఆర్ కు అందివ్వనున్నారు. హైదరాబాద్ వేదికగా జాతీయ పార్టీ ప్రకటనకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ నెల 11న హైదరాబాద్ కు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి వస్తున్నారు. కుమారస్వామితో భేటీ తర్వాత కేసీఆర్ నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కొత్త పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఫ్రంట్‌లు, పొత్తుల లాంటి విషయాలపై జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాతే కేసీఆర్‌ దృష్టి సారిస్తారని తెలుస్తోంది. ఇక, సీఎంగా కొనసాగుతూనే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.

జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నట్టు ఇప్పటికే టీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించేశారు. ఈ మధ్య ఏ బహిరంగ సభలో మాట్లాడినా.. జాతీయ పార్టీ, జాతీయ రాజకీయాల గురించే ప్రస్తావిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో జెండా ఎత్తుదామా? మీరు నాకు తోడుగా ఉంటారా? యుద్ధం చేద్దామా? పట్టు పడదామా? అంటూ ప్రజల్ని ప్రశ్నిస్తూ.. వారి నుంచే సమాధానం రాబడుతున్నారు. ఇప్పుడు.. కేసీఆర్‌ జాతీయ పార్టీకి సమయం ఆసన్నమైంది. తర్వలోనే జాతీయ పార్టీని ప్రకటించనున్నారు గులాబీ పార్టీ బాస్. హైదరాబాద్‌ వేదికగానే జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని సమాచారం.

జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాతో జాతీయ పార్టీ ఏర్పాటుకు కేసీఆర్‌ చేసిన కసరత్తు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో పలు దపాలుగా మంతనాలు జరిపిన కేసీఆర్‌.. కొత్త పార్టీకి సంబంధించిన విధి విధానాలకు తుది రూపునిచ్చినట్లు సమాచారం. ‘భారత రాష్ట్ర సమితి’, ‘భారత నిర్మాణ సమితి’, ‘భారత ప్రజా సమితి’ లాంటి పేర్లను పరిశీలించి.. అందులో ఒక పేరును ఖరారు చేసే పనిలో ఉన్నారట. ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు కేసీఆర్.

కేసీఆర్ ను దేశ్ కీ నేతగా అభివర్ణించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దేశంలో రాక్షస పాలన నడుస్తోందని, ఏ వర్గానికీ న్యాయం జరగడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆసేతు హిమాచలం ఆందోళనలో ఉందన్నారు. ప్రశ్నించే వాళ్లే లేరా అని అంతా అడుగుతున్నారని చెప్పారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలని, దేశ రాజకీయాల్లోకి రావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. కేసీఆర్ లాంటి పట్టుదల, చిత్తశుద్ధి, భవిషత్తు పట్ల విశ్వాసం, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు అయితేనే ఈ దేశానికి సుస్థిరమైన పాలన అందించే అవకాశం ఉంటుందన్నారు. కచ్చితంగా కేసీఆర్ మళ్లీ ఉద్యమానికి నడుం కట్టాల్సిందే, జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు.