ఆగిపోయిన అక్షర దీపం : చదువుకు డబ్బులు లేక యువతి ఆత్మహత్య

  • Published By: madhu ,Published On : November 9, 2020 / 01:03 PM IST
ఆగిపోయిన అక్షర దీపం : చదువుకు డబ్బులు లేక యువతి ఆత్మహత్య

Telangana college Student Aishwarya died : తెలంగాణ షాద్ నగర్‌కు చెందిన ఐశ్వర్య చదువులో ఫస్ట్. తెలివిలో బెస్ట్. ఐఏఎస్ కావాలన్నది ఆ యువతి కల. ఇందుకోసం రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లి, కేంద్ర ప్రభుత్వం అందించే కొద్ది సాయంతో, కుటుంబ సభ్యుల అండతో చదువుకునేందుకు ముందుకు సాగింది. కానీ కరోనా లాక్‌డౌన్ వల్ల ఇంటికి రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ అమ్మాయి జీవితాన్ని తలకిందులు చేసింది. ఢిల్లీలో ఆ అమ్మాయి ఉంటున్న హాస్టల్ ఖాళీ చేయాలని సమాచారం రావడంతో కంగారు పడింది. మళ్లీ డబ్బు కట్టి కొత్త వసతి వెతుక్కునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది.



తినడానికి పూట గడవని పరిస్థితులు :-
డబ్బులు సమకూర్చేందుకు దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్ రెడ్డి, సుమతి విశ్వప్రయత్నం చేశారు. కానీ విధి వాళ్లను వెక్కిరించింది. అప్పటికే కష్టాల్లో ఉన్న శ్రీనివాస్ రెడ్డికి కామెర్లు రావడం, ఆసుపత్రి ఖర్చులు పెరగడం, తినడానికి కూడా పూటగడవని పరిస్థితులు కూడా నెలకొనడం ఐశ్వర్యను మరింత కుంగదీసింది. తన చదువు ముగిసిందని, జీవితం అంధకారంలోకి జారుకుందని దిగులు పడుతూ ప్రాణాలు విడిచింది.



ఐఏఎస్ చదివి :-
ఐఏఎస్ చదివి ఆ కుటుంబంలో వెలుగులు నింపాల్సిన అమ్మాయి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ నెల 3న ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
చనిపోవడానికి ముందు ఐశ్వర్య రాసిన సూసైడ్ నోట్ అందరికి కన్నీళ్లను తెప్పిస్తున్నాయి. నా చావుకు ఎవరూ కారణం కాదు. నావల్ల మా ఇంట్లో చాలా ఖర్చులు అవుతున్నాయి. నేను భారం వాళ్లకి. నా చదువు భారం. నేను చదువు లేకపోతే బ్రతకలేను. నేను చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నా. నాకు చావే కరెక్ట్ అనిపించింది. నేను చచ్చినందుకు నాకు సంబంధాలు అంటగడతారు. కానీ నేను ఏ పాపం ఎరగను. ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్‌ ఒక సంవత్సరం వచ్చేలా చూడండి. అందరూ నన్ను క్షమించండి. నేను మంచి కూతుర్ని కాదు. అంటూ లెటర్ రాసింది.



ఇన్ స్పైర్ స్కాలర్ షిప్ :-
ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు తెచ్చుకున్న ఐశ్వర్యకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇచ్చే ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్‌కి ఎంపికయ్యింది. అయితే ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటికి వరకు వాళ్లకు స్కాలరషిప్‌లను విడుదల చేయలేదు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో ఆమె తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లింది. ఐశ్వర్య చదువు కోసం ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిని కూడా తాకట్టు పెట్టారని, ఆమె చావుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని విద్యార్ధి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఆమెకు రావాల్సిన స్కాలర్ షిప్‌లతో పాటు ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



చుట్టుముట్టిన కష్టాలు :-
చిన్నప్పటీ నుంచి ఐశ్వర్య చదువులో ఫస్ట్. పదో తరగతి, ఇంటర్‌లో మంచి మార్కులు రావడంతో ఆమె ప్రతిభను గుర్తించిన ఓ టీచర్… ఢిల్లీ వెళ్లి చదువుకోవాలని, అక్కడ ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటే ఖచ్చితంగా నీ కలను సాకారం చేసుకోవచ్చని ప్రోత్సహించాడు. ఐశ్వర్యకు తాము సాయం చేస్తామని పట్టణానికి చెందిన కొందరు హామీ కూడా ఇచ్చారు. అయితే ఆదుకుంటామన్న వారు ముఖం చాటేయడం, సమయానికి డబ్బులు అందకపోవడం, కరోనా కారణంగా కుటుంబానికి ఉపాధి లేకపోవడం అన్ని కష్టాలు చుట్టుముట్టడంతో తన కూతురు ప్రాణాలు తీసుకుందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.