తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యంకు అనారోగ్యం..టీపీసీసీ అధ్యక్షుడి ప్రకటన మరింత ఆలస్యం

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యంకు అనారోగ్యం..టీపీసీసీ అధ్యక్షుడి ప్రకటన మరింత ఆలస్యం

TPCC president’s statement further delayed : టీపీసీసీ చీఫ్‌ నియామకంలో ఉత్కంఠ కొనసాగుతోంది. మాపో.. రేపో అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే… తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ప్రకటన మరింత ఆలస్యం కానుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ అనారోగ్యమే దీనికి కారణంగా కనిపిస్తోంది. ఆయనకు జ్వరం రావడం, కరోనా పరీక్ష ఫలితం రావాల్సి ఉండటంతో… టీపీసీసీ చీఫ్ ప్రకటన ఆలస్యం కానుంది. పీసీసీ అధ్యక్షుడితో పాటు.. ఇతర పదవులకు అభ్యర్థులను కూడా ఒకేసారి ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు టీపీసీసీ చీఫ్‌ నియామకంలో మరో ట్విస్ట్‌… మొన్నటివరకూ రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు ప్రచారంలో ఉండగా… ఇప్పుడు అనూహ్యంగా జీవన్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అన్ని లెక్కలు వేసి అందరి అభిప్రాయాలు తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్… జీవన్‌రెడ్డివైపు మొగ్గినట్లు తెలుస్తోంది. నిన్నమొన్నటి దాకా రేవంత్‌రెడ్డికే ఖరారైనట్లు ప్రచారం జరిగినా అనూహ్యంగా ఇప్పుడు జీవన్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. అధికారికంగా ప్రకటించడమే మిగిలింది.

ఈ ప్రకటన కూడా ఈ రోజో రేపో అన్నట్లుగా తెలుస్తోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్‌రెడ్డి గతంలో టీడీపీ, కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసారు. జగిత్యాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా కూడా ప్రాతినిధ్యం వహించారు. TRS అధినేత కేసీఆర్‌పై రెండుసార్లు ఎంపీగా కూడా పోటీచేసి ఓటమిపాలయ్యారు. పార్టీకి విధేయుడిగా, అందరితో సఖ్యతగా ఉండటం వల్లే జీవన్‌రెడ్డి వైపు అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రచార కమిటీ సారథిగా రేవంత్‌రెడ్డిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. జీవన్‌రెడ్డి-రేవంత్‌రెడ్డిల కాంబినేషన్‌ రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు కలసి వస్తుందా….? పార్టీకి పూర్వవైభవం తెస్తుందా…? అన్నది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.