తెలంగాణలో ‘సన్నా’ల కొనుగోలుపై నిరసనలు, ఆందోళనలు

  • Published By: madhu ,Published On : November 13, 2020 / 08:09 AM IST
తెలంగాణలో ‘సన్నా’ల కొనుగోలుపై నిరసనలు, ఆందోళనలు

Telangana Congress Leaders protest : తెలంగాణ రాష్ట్రంలో సన్నాల కొనుగోలుపై నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ ఇష్యూపై నిన్నమొన్నటి వరకు రైతులు ఆందోళన చేపట్టగా… ఇప్పుడు పొలిటికల్‌ పార్టీలు కూడా ఎంటరయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు నిరసనలకు దిగాయి. సన్నాలను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశాయి. దీంతో సన్నాల నిరసనలు..రాజకీయ రంగును పులుముకున్నాయి.



సన్న రకాల వరి ధాన్యం :-
తెలంగాణలో సన్నరకాల వరిధాన్యంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతు సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. నల్లగొండలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి ఆందోళన నిర్వహించారు. రైతు సమస్యలపై కలెక్టర్‌కు మెమోరాండం ఇచ్చారు. సన్నాలను 2వేల 5వందల రూపాయలకు కొనుగోలు చేయాలని, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 20 వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.



కరీంనగర్ లో ఆందోళన :-
రైతు సమస్యలపై కరీంనగర్‌లో కాంగ్రెస్‌ చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్‌లోనికి చొచ్చుకెళ్లేందుకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, పొన్నం ప్రభాకర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవ పెరగడంతో… పోలీసులు, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కాంగ్రెస్‌ కార్యకర్తల చొక్కాలు చిరిగిపోయాయి.



ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో :-
హన్మకొండ వద్ద ఆందోళనకు దిగిన పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏకశిలా పార్క్‌ నుంచి కలెక్టరేట్‌కు కాంగ్రెస్‌ కార్యకర్తలు బయలుదేరగా.. వారిని మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్‌ చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న వీహెచ్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని హెచ్చరించారు. అటు ములుగు జాతీయ రహదారిపై ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయించారు. గొర్రు, నాగళ్లతో రాస్తారోకో నిర్వహించారు.



రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి :-
తెలంగాణలో రైతులు పండించిన సన్నరకం వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయాలని కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సన్నాలు వేయాలని రైతులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిందని.. వేయకపోతే రైతుబంధు రాదని కూడా చెప్పిందని అన్నారు. తీరా రైతులంతా సన్నాలు పండించి మార్కెట్‌కు ధాన్యం తీసుకొస్తే.. కొనుగోలు చేయడకపోవడం దారుణమన్నారు. మొత్తానికి తెలంగాణలో సన్నాలపై ఆందోళనలు రోజురోజుకు మిన్నంటుతున్నాయి. నిన్నమొన్నటి వరకు రైతులు ఆందోళన నిర్వహించగా.. ఇప్పుడు పొలిటికల్‌ పార్టీలు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రంగంలోకి దిగాయి.