Telangana Corona : తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. 2వేలు దాటిన కొత్త కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఆ సంఖ్య 2 వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది.

Telangana Corona : తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. 2వేలు దాటిన కొత్త కేసులు

Corona Telangana

Telangana Corona Cases : తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఆ సంఖ్య 2 వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. నిన్న(ఏప్రిల్ 7,2021) రాత్రి 8గంటల వరకు 87వేల 332 మందికి కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 2వేల 055 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఏడుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,741కి చేరింది.

కరోనా నుంచి నిన్న 303 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,601కి చేరింది. ప్రస్తుతం 13వేల 362 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 8వేల 263 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం(ఏప్రిల్ 8,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

ఏపీని హడలెత్తిస్తున్న కరోనా:
కరోనా మహమ్మారి ఏపీని హడలెత్తిస్తోంది. సెకండ్ వేవ్ రూపంలో రాష్ట్రంలో విస్తృతంగా వ్యాప్తి చెందుంతోంది. ఫలితంగా రోజు రోజుకు పాజిటివ్‌ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 15 రోజుల క్రితం వందలోపే నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు ఏకంగా వేలకు చేరింది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2వేల 331 మందికి కరోనా వైరస్ సోకింది. రాష్ట్ర వ్యాప్తంగా 31వేల 812 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బుధవారం(ఏప్రిల్ 7,2021) కరోనా బులెటిన్ విడుదల చేసింది.

ఒక్కరోజే 11 కరోనా మరణాలు:
రాష్ట్రంలో ఒక్క రోజులోనే 11 మంది కరోనాతో చనిపోవడం ఆందోళన కలిగింది. చిత్తూరు జిల్లాలో నలుగురు, కర్నూలులో ఇద్దరు, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసుల సంఖ్య పెరగడంతో పాటు.. మృతుల సంఖ్యా పెరుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 853 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13వేల 276 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 91,32,74 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 89,27,36 మంది కోలుకున్నారు. 7,262 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

గుంటూరు జిల్లాలో అత్యధిక కేసులు:
రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి. గుంటూరు తర్వాత కృష్ణా జిల్లాలో 327 కేసులు, విశాఖపట్నంలో 298 కేసులు, చిత్తూరు జిల్లాలో 296 కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు:
అనంతపురంలో 202 కేసులు, నెల్లూరులో 186, కర్నూలులో 176, కడప జిల్లాలో 149 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళంలో 123 కేసులు, ప్రకాశం జిల్లాలో 110 కేసులు, విజయనగరంలో 47 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 29 కేసులు నమోదు కాగా పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 20 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

కరోనా ఉగ్రరూపం.. ఇండియాలో ఇదే తొలిసారి:
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోసారి దేశంలో లక్షకు పైగా పాజిటివ్ కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 12లక్షల 37వేల 781 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఒక లక్షా 26వేల 789 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,29,28,574కి చేరింది. వరసగా రెండో రోజు కరోనాతో 600మందికి పైగా మృత్యుఒడికి చేరుకున్నారు. నిన్న(ఏప్రిల్ 7,2021) 685 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా 1,66,862 మంది బలయ్యారు.

9లక్షల మార్క్ దాటిన యాక్టివ్ కేసులు:
రోజువారీ కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 9లక్షల 10వేల 319 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. యాక్టివ్ కేసుల రేటు 6.59 శాతానికి చేరింది. ఈ మేరకు గురువారం(ఏప్రిల్ 8,2021) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరాలు తెలిపింది. నిన్న నమోదైన కేసులు, మరణాలు.. ఇంతకు ముందెన్నడూ లేని వైరస్ తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.

కాగా, ఇంత ఉద్ధృతిలోనూ రికవరీలు కాస్త ఊరటనిస్తున్నాయి. నిన్న 59వేల 258 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 1.18కోట్ల మందికి పైగా వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 92.11శాతానికి పడిపోయింది.