Bikes Theft in Telangana : బైకులు భద్రం బ్రదరూ.. పుల్లతో లాక్ తీసేస్తారు .. చిటికెలో మాయం చేసేస్తారు..

బైక్ చోరీలకు అడ్డాగా మారిన నిజామాబాద్ లో పెద్ద బైకులను టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్నారు దొంగలు. ప్రధానంగా కొత్త బుల్లెట్ బండ్లను టార్గెట్ చేసి లాక్ తీసేసి రాష్ట్రం దాటించేస్తున్నారు.

Bikes Theft in Telangana :  బైకులు భద్రం బ్రదరూ.. పుల్లతో లాక్ తీసేస్తారు .. చిటికెలో మాయం చేసేస్తారు..

bike thief

Bikes Theft in Telangana : మీ బైక్ ఎక్కడపడితే అక్కడ పార్క్ చేస్తున్నారా?  లాక్ వేశాం కదానే ధీమాతో పార్క్ చేసిన బైక్ సేఫ్ గా ఉందని భావిస్తున్నారా? ఇంటిముందే పార్క్ చేసాంలే ఎక్కడికి పోతుందని ధీమాగా ఉన్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే బైక్ దొంగల చాకచక్యంతో లక్షలు పెట్టి కొన్న బైక్ కాస్త క్షణాల్లో మాయం అయిపోతుంది. ఆ పై లబోదిబోమన్నా మీబైక్ ఇక కంటికి కనిపించదు. రాష్ట్రాలు దాటేస్తుంది. ఓ చిన్న పుల్లలాంటి తీగ చాలు ఎటువంటి బైక్ అయినా లాక్ ను చిటికెలో తీసేస్తారు. బైక్ లకు మాయం చేసేస్తున్నారు దొంగలు. తాళం వేసినా క్షణాల్లో తాళం తీసేయటం బైక్ ఎత్తుకుపోవటం వారికి వెన్నతో పెట్టిన విద్యలా ఉంది. తెలంగాణలోని నిజామాబాద్ లో బైక్ దొంగలు బైక్ కనిపిస్తే చాలు క్షణాల్లో మాయం చేసేసి రాష్ట్రం దాటించేస్తున్నారు. వీరి ఆగడాలపై కన్నేసిన నిజామాబాద్ పోలీసులు బైక్ దొంగల ముఠా ఆట కట్టించారు. నలుగురు బైక్ దొంగలకు పట్టుకున్నారు. దొంగలు బైక్ ల లాక్ లు ఎలా తీస్తారో చూసిన పోలీసులే షాక్ అయ్యారు.

నిజామాబాద్ నగరం బైక్ దొంగలకు అడ్డాగా మారింది. ముఖ్యంగా పెద్ద బైకులను టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్నారు దొంగలు. ప్రధానంగా కొత్త బుల్లెట్ బండ్లను టార్గెట్ చేసి లాక్ తీసేసే రాష్ట్రం దాటించేస్తున్నారు. అలా రెండు నెలల వ్యవధిలో ఏకంగా 109 కు పైగా టూ వీలర్స్‌ను చోరీ చేశారు. పక్కాగా రెక్కీ నిర్వహిస్తూ… ఓ ముఠాగా ఏర్పడి రాత్రి సమయాల్లో బైక్ లను దొంగిలిస్తున్నారు. దీంతో నిజామాబాద్ పోలీస్ లకు ఈ బైక్ దొంగల కేసు సవాల్ గా మారింది. వారిపై కన్నేసి ఎట్టకేలకు పట్టుకున్నారు. చోరీలకు పాల్పడే వారంతా నిజామాబాద్ జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

నగరంలో ఉన్న 6 పోలీసు స్టేషన్ల పరిధిలో బైక్ చోరీల కేసులు నిత్యం నమోదు అవుతూనే ఉన్నాయి. ఇలా చోరీకి గురవుతున్న బైక్ లను రాత్రికి రాత్రే ఇతర రాష్ట్రాలకు తరలిoచేస్తున్నారు. తరలించిన కొన్ని బైక్ ల కలర్స్ ను కూడా మార్చేసి మహారాష్ట్ర, కర్ణాటకలు తరలించేసి అమ్మేస్తున్నారని పోలీసులు విచారణలో తేలింది. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో పగటి వేళ రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో నిమిషాల్లో చోరీ చేసేస్తున్నారు కేటుగాళ్లు. జిల్లాలో ఇటీవల పదుల సంఖ్యలో బుల్లెట్ బైక్స్, ఇతర కంపెనీల బైక్ లు వందకి పైగా చోరీకి గురయ్యాయి.

దీంతో నిజామాబాద్ పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా పోలీసులు సైతం షాక్ అయ్యే విషయాలు బయటపడ్డాయి. ఓ పుల్లలాంటి ఊచముక్కతో ఎటువంటి లాక్ అయినా సరే క్షణాల్లో తీసేస్తారని తెలుసుకున్నారు పోలీసులు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల వద్ద 8 బుల్లెట్ వాహనాలతో పాటు పదుల సంఖ్యలో ఇతర టూ వీలర్ వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన విలువైన బైకులను ఇక్కడి నుంచి ముందుగా హైదరాబాద్ లోని ఓ వ్యాపారికి నిందితులు విక్రయిస్తున్నారట. అనంతరం ఆ వ్యాపారి వాటిని తనతో సంబంధాలు ఉన్న మరో చోరీ వాహనాల వ్యాపారికి.. ఇలా నలుగురు వ్యాపారుల చేతులు మారి, చివరికి వాహనాలను పొరుగు రాష్ట్రం కర్ణాటకకు తరలిస్తున్నారని తేలింది. ఈ వాహనాల దొంగల గ్యాoగ్ ఏ ప్రాంతం, రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు.