తెలంగాణలో కరోనా సామాజిక వ్యాప్తి లేదు : ఐసీఎంఆర్

  • Published By: bheemraj ,Published On : June 11, 2020 / 12:48 AM IST
తెలంగాణలో కరోనా సామాజిక వ్యాప్తి లేదు : ఐసీఎంఆర్

దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రతను అంచనా వేసేందుకు ఐసీఎంఆర్ చేపట్టిన ప్రివలెన్స్‌ సర్వేలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సామాజిక వ్యాప్తి లేదని తేలింది. ఐసీఎంర్‌, ఎన్‌ఐఎన్‌ సంయుక్తంగా నిర్వహించిన సర్వే వివరాలను బుధవారం (జూన్ 10, 2020) వెల్లడించింది. హైదరాబాద్‌ సహా నాలుగు జిల్లాల పరిధిలో చేపట్టిన సర్వేలో 1,700 మంది నుంచి శాంపిళ్లను సేకరించారు. ఇందులో 19 మందికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాప్తిని గుర్తించేందుకు మే 15 నుంచి 17వ తేదీ వరకు జనగామ, కామారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఐసీఎంర్‌ ప్రివలెన్స్‌ సర్వే చేపట్టింది. 

ఒక్కో జిల్లాలో 400 శాంపిల్స్ చొప్పున మొత్తం 1,200 మంది శాంపిల్స్ సేకరించగా, వీటిలో నాలుగు మాత్రమే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఐసీఎంర్‌ సర్వేలో అతి తక్కువ మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి లేదని తెలుస్తోంది. మే 30, 31 తేదీల్లో హైదరాబాద్‌లోని 5 కంటైన్మెంట్‌ జోన్లలో (ఆదిభట్ల, తప్పచబుత్ర, మియాపూర్‌, చందానగర్‌, బాలాపూర్‌) సీరం సర్వే నిర్వహించింది. ఒక్కో జోన్‌లో 100 శాంపిల్స్ చొప్పున మొత్తం 500 మంది శాంపిల్స్ సేకరించి పరీక్షించారు. వీటిలో కేవలం 15 మందికి మాత్రమే కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 

తెలంగాణలో బుధవారం (జూన్ 10, 2020) కొత్తగా 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో మరో ఎనిమది మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా కేసులు 4,111కి చేరాయి. కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 156కు పెరిగింది. రాష్ట్రంలో 2,138 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 1, 817 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

జీహెచ్ ఎంసీ పరిధిలో అత్యధికంగా 143 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మేడ్చల్ 11, సంగారెడ్డి 11, రంగారెడ్డి 8 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహబూబ్ నగర్ 4, జగిత్యాల 3, మెదక్ 3, నాగర్ కర్నూల్ 2, కరీంనగర్ 2 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిజామాబాద్, వికారాబాద్, నల్లగొండ సిద్దిపేటలో ఒక్కో కరోనా కేసు నమోదు అయింది. 

Read: తెలంగాణలో కరోనా : కేంద్ర బృందం హెచ్చరికలు..జులై 31 నాటికి పరిస్థితి తీవ్రం..