Telangana Formation Day 2023: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు సాధించిందేంటీ?

ప్రత్యేక రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులతో నీళ్ల సమస్య తీరింది.. నిధుల మాటేమిటీ? కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు సకాలంలో అందుతున్నాయా? మిగతా అంశాల సంగతేంటీ? పూర్తి వివరాలు....

Telangana Formation Day 2023: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు సాధించిందేంటీ?

Telangana Formation Day 2023

Telangana Formation Day 2023: తెలంగాణ ప్రజలు అంబరాన్నంటే ఆనందంతో పండుగ చేసుకునే రోజు జూన్ 2. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన రోజు ఇది. దశాబ్దాల పోరాటం.. ఎందరో వీరుల త్యాగ ఫలం.. ప్రత్యేక ఆకాంక్ష.. స్వరాష్ట్రంపై అభిలాష.. సంస్కృతి, సాహితీ ఉద్యమం.. మేథావుల ఆరాటం.. నిరుద్యోగుల ఆశల సౌధం ప్రత్యేక తెలంగాణ. మరి ఉద్యమకారులు పాలకులుగా మారిన తెలంగాణలో స్వపరిపాలన కాంక్ష నెరవేరిందా?

నీళ్లు, నిధులు, నియామకాల నినాదంలో ఆచరణలో ఎంతమేర విజయవంతమైంది. ప్రత్యేక రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులతో నీళ్ల సమస్య తీరింది.. నిధుల మాటేమిటి? కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు సకాలంలో అందుతున్నాయా? ఉద్యమంలో నిరుద్యోగులు ఉత్సాహంగా పాల్గొనడానికి కారణమైన నియామకాల సంగతేంటి? ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చారు. ఇంకా ఎన్ని ఉద్యోగాలివ్వాల్సివుంది? తదితర విషయాలు తెలుసుకుందాం.

ఇప్పటికీ ఉద్యమ స్ఫూర్తి
ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు పాలకులుగా మారడం దేశ చరిత్రలో ఒక్క తెలంగాణలోనే కనిపిస్తుంది. అందుకే తెలంగాణ పాలనలో ఇప్పటికీ ఉద్యమ స్ఫూర్తి కనిపిస్తుంది. ప్రజలు కూడా ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను పరిష్కరించాల్సిందిగా డిమాండ్‌ చేస్తుంటారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం విజయం సాధించింది. కానీ ఈ తొమ్మిదేళ్లలో ఈ నినాదంపై మిశ్రమ స్పందనే కనిపిస్తోంది. కృష్ణా, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ సక్సెస్‌ అయింది.

విమర్శలు అనేకం
నిధులు, నియామకాల విషయంలో ఆశించిన పురోగతి సాధించలేదనే విమర్శలు మాత్రం ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యమ సమయంలో నిరుద్యోగులను ఆకర్షించిన నియామకాలు.. తొమ్మిదేళ్ల పాలనలో పెద్దగా లేవనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతున్నా.. ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయని.. ఖాళీలను భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ ఏడాది దాదాపు 90 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయినా.. పేపర్‌ లీక్‌ సంఘటనతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక నిరుద్యోగ భృతి హామీ అమలు కాలేదనే ఆవేదన నిరుద్యోగుల్లో కనిపిస్తుంది. ఇదే సమయంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. మన ఊరు-మనబడి పథకం కింద ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చాలని నిర్ణయించుకుంది ప్రభుత్వం. కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా మొట్టమొదటి విద్యా కేంద్రం ఇటీవలే సిరిసిల్ల జిల్లాలో ప్రారంభమైంది.

మెడికల్‌ కళాశాలలు
ఇక తెలంగాణలో మెడికల్‌ కళాశాలలు కూడా పెద్ద సంఖ్యలో ఏర్పడ్డాయి. 2014కు ముందు రాష్ట్రంలో కేవలం ఐదు వైద్య కళాశాలలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 29కి చేరింది. వీటిలో కొన్ని ఇప్పటికే నిర్మాణం పూర్తికాగా, ఇంకొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. వేలాది వైద్య విద్య సీట్లు అందుబాటులోకి రావడంతో గ్రామీణ విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి వచ్చింది. ఇక ఆస్పత్రుల అభివృద్ధితో కొత్త ఉద్యోగాలు రావడమే కాకుండా.. వైద్యం పేదలకు చేరువైంది.

లక్ష్యాలు అనేకం
కోట్ల మంది ఆకాంక్ష మేరకు ఏర్పడిన తెలంగాణ ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలు చాలానే ఉన్నాయి. తొమ్మిదేళ్ల ప్రయాణంలో రికార్డుస్థాయిలో విజయాలు నమోదు చేసినా.. గమ్యం ఇంకా సుదూరంగానే కనిపిస్తుంది. విప్లవాత్మకంగా వ్యవసాయంలో మార్పులు వచ్చినా.. పంట దిగుబడులకు గిట్టుబాటు ధర, సరైన సమయంలో పంటలు విక్రయించుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన రైతు రుణ మాఫీ హామీ అమలు కాలేదు.

దళితులకు మూడు ఎకరాల భూమి పథకం అమలుకు నోచుకోలేదు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పథకంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ధరణి పోర్టల్‌లో లోపాల వల్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ భవిష్యత్‌లో తెలంగాణ ప్రభుత్వం సరిదిద్దుకోవాల్సిన అంశాలు. తొమ్మిదేళ్ల సక్సెస్‌ జర్నీతో పదో వసంతంలోకి అడుగుపెడుతున్న కేసీఆర్‌ సర్కార్‌.. ఈ ఏడాదిలో అసంపూర్తిగా ఉన్న.. విమర్శలు ఎదురవుతున్న పథకాలపై దృష్టి సారించాల్సివుందని అంటున్నారు పరిశీలకులు.

ఎన్నో చిరస్మరణీయ విజయాలు
స్వరాష్ట్రం కోసం.. స్వపరిపాలన కోసం పరితపించిన తెలంగాణ వాసులు ఈ తొమ్మిదేళ్లలో తమ దశాబ్దాల కలను నెరవేర్చుకున్నారు. వెనుకబడిన ప్రాంతంగా తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ.. ఇప్పుడు అభివృద్ధిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రాజెక్టులు.. వ్యవసాయం, విద్యుత్‌, పరిశ్రమలతో అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధిలో దూసుకుపోతోంది తెలంగాణ. సంక్షేమ పథకాల్లోనూ దేశానికి నమూనాగా మారింది.

ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. సరికొత్త రికార్డులు నెలకొల్పింది. వ్యవసాయ, నీటిపారుదల రంగాల్లో తెలంగాణ సాధించిన అభివృద్ధి కొత్త చరిత్రకు నాంది పలికింది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సిస్టం.

లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు దేశానికే నమూనాగా చెప్పొచ్చు. తెలంగాణ ఆవిర్భవించిన ఐదేళ్లలోనే పూర్తయిన కాళేశ్వరానికి.. కొత్త రాష్ట్రంలోనే పునాది పడింది. రికార్డు సమయంలో నిర్మాణం పూర్తిచేసుకుని.. సాగునీటి సద్వినియోగంపై దేశానికి పాఠం నేర్పింది.

కాళేశ్వరం ప్రాజెక్టు

Kaleshwaram project

Kaleshwaram project

ఎక్కడో అడుగుల్లో ఉన్న నీటిని ఎగువకు సరఫరా చేయొచ్చని నిరూపించిన కాళేశ్వరం ప్రాజెక్టు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చని చాటిచెప్పింది. హైదరాబాద్‌ నగరానికి మంచినీటి సరఫరాలోనూ ఈ ప్రాజెక్టు కీలకంగా పనిచేస్తుంది. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన అతిపెద్ద విజయాల్లో కాళేశ్వరం అతిముఖ్యమైనది. ఇదో మైలురాయిగా కూడా చెప్పొచ్చు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో సాగునీటి సరఫరా మెరుగైంది. వ్యవసాయాభివృద్ధి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఇంజనీరింగ్‌ అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణను దేశానికి కొత్త రైస్‌ బౌల్‌గా మార్చింది. రెండు పంటలకు గరిష్టస్థాయిలో నీటిని అందించడమే కాకుండా వ్యవసాయోత్పత్తి నాలుగు రెట్లు పెరిగేలా చేసింది.

తెలంగాణ ఆవిర్భావానికి ముందు 28.18 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేస్తే.. ఇప్పుడు ఏకంగా 63.53 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. అంటే అదనంగా 32 లక్షల ఎకరాల భూమి సాగు పరిధిలోకి వచ్చింది. ఒకప్పుడు బంజరుగా ఉన్న భూముల్లో బంగారం పండిస్తున్నారు రైతులు. ఇదంతా కొత్త రాష్ట్రం వల్లే సాధ్యమైందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

రికార్డుస్థాయిలో సాగు విస్తీర్ణం పెరగడంతో దేశంలో అత్యధికంగా వరి సాగుచేసే రాష్ట్రాల్లో మూడోస్థానం దక్కించుకుంది తెలంగాణ. దేశంలో పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌ తర్వాత ధాన్యం అధిక సేకరణ తెలంగాణ రాష్ట్రం నుంచి జరుగుతోంది. నీటిపారుదల, వ్యవసాయ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిన రాష్ట్రం తలసరి ఆదాయాన్ని పెంచుకుంది.

దేశ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎక్కువ. జాతీయ తలసరి ఆదాయం లక్షా 71 వేల రూపాయలు కాగా, తెలంగాణ తలసరి ఆదాయం మూడు లక్షల 17 వేల రూపాయలు. ఈ విధంగా రైతులు, రైతు కుటుంబాల్లో సంతోషం నింపింది ప్రత్యేక తెలంగాణ.

దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ వ్యవసాయ రంగం.. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. కేవలం నాలుగేళ్ల వ్యవధిలో నిర్మాణం పూర్తిచేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ చరిత్రలో మైలురాయిగా నిలిస్తే.. ఆ ప్రాజెక్టు వల్ల విద్యుత్‌ ఉత్పత్తిలోనూ రికార్డులు సృష్టిస్తోంది తెలంగాణ.

మిషన్‌ భగీరథ
ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలల ప్రాజెక్టు అయిన మిషన్‌ భగీరథ.. తెలంగాణ వాసుల మంచినీటి కష్టాలను తీర్చింది. దాదాపు 43 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన మిషన్‌ భగీరథ 25 వేల ఆవాసాలకు తాగునీటిని సరఫరా చేస్తోంది. పట్టణాలు.. పల్లెలు అన్న తేడా లేకుండా ఇంటింటికి మంచినీరు సరఫరా చేయడమే మిషన్‌ భగీరథ ప్రధాన ఉద్దేశం.

ఈ పథకం కింద తెలంగాణను ప్రధానంగా వేధించిన ఫ్లోరైడ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. హైదరాబాద్‌ మహానగరానికి కూడా సమృద్ధిగా మంచినీరు అందుతోంది. మిషన్‌ భగీరథ ప్రజల దాహార్తిని తీర్చడమే కాదు.. రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అంతేకాదు మిషన్‌ భగీరథ జాతీయ స్థాయిలో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఈ ప్రాజెక్టు స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ జలజీవన్‌ మిషన్‌ ప్రాజెక్టును తెచ్చింది. తెలంగాణలో ఏ విధంగా అయితే ఇంటింటికి కొళాయి నీటని సరఫరా చేస్తున్నారో.. అదేవిధంగా దేవవ్యాప్తంగా మంచినీటిని పంపిణీ చేయాలనేది జలజీవన్‌ మిషన్‌ ఉద్దేశం. మిషన్‌ భగీరథ పథకంతో ఇంటింటికి మంచినీరు సరఫరా అవుతోంది. కంటివెలుగు పథకంతో చీకట్లు తొలగించి సరికొత్త వెలుగులు పంచుతోంది ప్రత్యేక రాష్ట్రం.

విద్యుత్‌ కోతలు లేవు..
ఒకప్పుడు తెలంగాణ అంటే విద్యుత్‌ కోతలు, నీటి సరఫరాలో అస్థిరత, మంచినీళ్ల ట్యాంకర్ల కోసం సుదీర్ఘ నిరీక్షణ, ఎండిపోయిన వ్యవసాయ పొలాలు, ఉపాధి కోసం వలసలే గుర్తొచ్చేవి. కానీ, కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తొమ్మిదేళ్లలోనే ఇలాంటి దీర్ఘకాల సమస్యలను అధిగమించింది తెలంగాణ.

ఇప్పుడు దేశంలో 24 గంటలు కరెంటు సరఫరా జరుగుతున్న అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇంటింటికి మంచినీటి సరఫరా చేస్తున్న రాష్ట్రాల్లోనూ తెలంగాణదే అగ్రస్థానం. ఎండిపోయిన పొలాలు లేవు.. బీడువారిన భూములూ కనిపించవు. పెరిగిన అవకాశాలతో వలసలకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి తెలంగాణకు వలసలు వస్తుండటం రాష్ట్ర ప్రగతికి నిదర్శనంగా చెప్పొచ్చు.

కొత్త రాష్ట్రంలో కరెంటు కష్టాలు తప్పవు అన్న హెచ్చరికలను సవాల్‌గా తీసుకుంది తెలంగాణ. కేవలం తొమ్మిదేళ్లలో విద్యుత్ రంగాన్ని మెరుగుపరచుకుని 24 గంటల సరఫరాతో ప్రత్యేకత చాటుకుంది తెలంగాణ విద్యుత్‌ రంగం. ఒకప్పుడు ఎప్పుడు కరెంటు ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి నుంచి ఇప్పుడు 24 గంటల కరెంటు సరఫరా విధానంలోకి మారింది తెలంగాణ.

అంతేకాదు రైతులకు.. వ్యవసాయానికి కూడా 24 గంటల ఉచిత విద్యుత్‌ అందుతోంది. ఇక మిషన్‌ భగీరథ పథకంతో గ్రామగ్రామానికి మెరుగైన మంచినీరు సరఫరా వ్యవస్థ వచ్చింది.

తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది అన్నది ప్రభుత్వ నినాదమైనా.. ఆచరణలో అదే నిజంగా కనిపిస్తోంది. మిషన్‌ భగీరథను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలనూ దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. రైతు బంధు పథకం ముందుగా తెలంగాణలో ప్రకటించినదే.. ఇదే స్కీమ్‌ను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేయడం విశేషంగా చెప్పొచ్చు. ఇక ఉద్యమ కాలంలో ఎక్కువగా వినిపించిన నినాదం స్వపరిపాలన.

కొత్త రాష్ట్రంలో స్థానిక పాలనకు పెద్దపీట వేసింది ప్రభుత్వం. పది జిల్లాల తెలంగాణ 33 జిల్లాలుగా కొత్తగా రూపుదిద్దుకుంది. పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు.. ఇలా అన్ని స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా సమూల మార్పులు చోటుచేసుకున్నాయి ఈ తొమ్మిదేళ్లలో.

పట్టణీకరణకు పెద్దపీట వేసిన తెలంగాణ ప్రభుత్వం అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇచ్చింది. హైదరాబాద్‌ నగరంతోపాటు వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ వంటి ప్రాంతాలకూ ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలతో సమాంతర వృద్ధి సాధించేలా అడుగులు వేస్తోంది ప్రభుత్వం.

రాష్ట్ర ఆదాయం మాటేంటీ?
ఇక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక సమ్మిళత అభివృద్ధితో ఆదాయం కూడా దండిగా పెరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఆదాయం కేవలం 51 వేల కోట్ల రూపాయలు. ఆ మరుసటి ఏడాది 76 వేల కోట్లు.. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు 15 వేల కోట్లు పెరిగింది.

రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టాలంటే ఈ మాత్రం ఆదాయం సరిపోదని భావించిన ప్రభుత్వం.. తొమ్మిదేళ్లలో ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంది. విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించడం ద్వారా ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్రం ఆదాయం లక్షా 50 వేల కోట్లు దాటిపోయింది. కేవలం తొమ్మిదేళ్లలో కాలంలో లక్ష కోట్ల ఆదాయం పెంచుకుని ప్రత్యేకత చాటుకుంది తెలంగాణ.

ఇలా రాష్ట్రం ఆదాయం పెరగడంలో సింహభాగం వాటా పరిశ్రమలదే.. వ్యవసాయ రంగం కూడా బాగా అభివృద్ధి చెందినా.. ఐటీ పరిశ్రమ తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని విధంగా అభివృద్ధి చెందింది. 2014లో 50 కోట్ల రూపాయల విలువ ఉన్న తెలంగాణ ఐటీ పరిశ్రమ ఇప్పడు లక్షా 84 వేల కోట్లకు పెరిగింది.

అంతర్జాతీయంగా ఐటీ సెక్టార్‌ సంక్షోభంలో ఉన్నా.. తెలంగాణలో ఆ ప్రభావం కనిపించలేదు. ఈ కాలంలో దేశవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఐటీ ఉద్యోగాలు వస్తే.. ఒక్క తెలంగాణలోనే లక్షా యాబైవేల ఉద్యోగాలు వచ్చాయి. అంటే దేశంలో మూడింట ఒక వంతు ఉద్యోగాలు తెలంగాణలో ఉండటం విశేషంగా చెప్పొచ్చు.

స్థానిక పరిస్థితులు.. మెరుగైన వసతులు ఉండటం వల్ల దేశంలో ఐటీ ఇండస్ట్రీకి గమ్యస్థానంగా మారింది తెలంగాణ. ఇలా అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ.. ఎన్నో సంక్షేమ పథకాలతో స్వరాష్ట్రంలో ప్రజల కష్టాలను తీర్చింది. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఉద్యమించిన నేల ఇప్పుడు జలకళతో కళకళలాడుతుండగా.. నియామకాల విషయంలోనే ఇంకా లక్ష్యానికి చేరుకోవాల్సివుంది. ఇప్పటికే లక్ష ఉద్యోగాలు భర్తీ జరిగింది. ఇంకా 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అయినప్పటికీ నియామకాల్లో ఎంతో పురోగతి సాధించాల్సివుంది.

నూతన సచివాలయం వరకు..

Telangana Secretariat

Telangana Secretariat

సీఎం కేసీఆర్‌ ఆమోదించిన నమూనాతో నూతన సచివాలయం రూపుదిద్దుకుంది. నూతన సచివాలయాన్ని షాపూర్‌ జీ పల్లోంజి అండ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్మించింది. మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో 2.5 ఎకరాల్లో భవనాన్ని నిర్మించారు. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ తెలంగాణ రాష్ట్ర స‌చివాల‌యంగా పేరు పెట్టారు. 2023 ఏప్రిల్ 30న ప్రారంభించారు.

Telangana Formation Day 2023: కాంగ్రెస్ వేడుకలు… ముఖ్య అతిథిగా లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్